కార్వాన్, జూలై 2 : చారిత్రాత్మకమైన కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ ఠాకూర్ అమర్‌సింగ్ నేతృత్వంలో బోనాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేపడుతున్నారు. నిజాంకాలంలో గోల్కొండ కోటకు అప్పటి పరిపాలకులు కార్వాన్ రహదారి మీదుగా వెళ్లే సమయంలో దర్బార్ మైసమ్మ ఆలయానికి దర్శించుకునే వారని, ఛత్రపతి శివాజీ కూడా అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారని ప్రచారంలో ఉన్నది.
జూలై 16, 17 తేదీల్లో అంగరంగ వైభవంగా..
జూలై 16, 17 తేదీల్లో బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గాను నిర్వాహకులు ఏర్పాట్లు చేపడుతున్నారు. నగరంలోకెల్లా అతి పెద్ద తొట్టెలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించుకుంటారు. 15వ తేదీ రాత్రి పురానాపూల్ నుంచి తొట్టెలను ఊరేగింపుగా పురవీధుల మీదుగా కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయానికి తరలించి ప్రతిష్ఠిస్తారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఉత్సవాల ఏర్పాట్ల విషయమై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల ఆలయం వద్ద అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం విదితమే. ఆలయ కమిటీ చైర్మన్ ఠాకూర్ అమర్‌సింగ్‌తో కలిసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఘటాల ఊరేగింపునకు చర్యలు ..
కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయంలో 8న ఘటాల ఊరేగింపునకు ఆలయ కమిటీ చైర్మన్ ఠాకూర్ అమర్‌సింగ్ నేతృత్వంలో చర్యలు చేపడుతున్నారు. ఉత్సవాలకు వారం రోజుల ముందు అమ్మవారి ఘటాలను పరిసర ప్రాంతాల్లో ఊరేగిస్తారు. బస్తీలు, కాలనీల్లోని ప్రజలు ఘటాలకు పూజలు నిర్వహించడంతో పాటు సాకలు పోసి మొక్కులు తీర్చుకుంటారు.