Jubilee Hills | బంజారాహిల్స్, డిసెంబర్ 12: జూబ్లీహిల్స్ డివిజన్ నందగిరి హిల్స్ సమీపంలోని గురుబ్రహ్మనగర్ బస్తీలో మరోసారి హైడ్రా పేరుతో రెవెన్యూ అధికారులు హల్చల్ చేశారు. గురువారం మధ్యాహ్నం షేక్‌పేట మండల కార్యాలయం నుంచి రెవెన్యూ సిబ్బంది గురుబ్రహ్మనగర్ బస్తీకి వచ్చి కొన్ని గుడిసెలను ఖాళీ చేయాలని, లేకుంటే హైడ్రా అధికారులు వచ్చి మొత్తం బస్తీలో కూల్చివేతలు చేపట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీంతో బస్తీలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మూడునెలల కిందట బస్తీలో పేదల గుడిసెలకు అడ్డుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో రాత్రికి రాత్రే ప్రహరీ కట్టడం, పేదల ఇండ్లలోకి వెళ్లకుండా దారులు మూయడంతో పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంలో కొంతమంది బడాబాబుల కోసం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పనిచేస్తున్నాడని బస్తీవాసులు ఆందోళనకు దిగడంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల నుంచి బస్తీకి వస్తున్న షేక్‌పేట రెవెన్యూ సిబ్బంది బస్తీలోని కొన్ని గుడిసెలు తొలగించాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం కూడా కొంతమంది రెవెన్యూ సిబ్బంది బస్తీకి వచ్చి ఫొటోలు తీసుకుంటుండంతో బస్తీవాసులంతా అప్రమత్తమయ్యారు. మిమ్మల్ని ఎవరు పంపించారంటూ గట్టిగా నిలదీయగా, నీళ్లు నమిలారు. గతంలోనే గురుబ్రహ్మనగర్ పేదల బస్తీ జోలికి వచ్చిన హైడ్రా తీవ్ర అప్రతిష్టను మూటకట్టుకున్న నేపథ్యంలో మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.