దుండిగల్, ఫిబ్రవరి 11: నగర శివార్లలోని నిజాంపేటలో (Nizampet) అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరఢ ఝులిపించారు. నిజాంపేటలోని సర్వేనెంబర్ 334 అసైన్డ్ భూముల్లో వెలసిన నిర్మాణాల కూల్చివేతను అధికారులు మరోసారి చేపట్టారు. వారం రోజుల క్రితమే ఇక్కడ కొన్ని నిర్మాణాలను తొలగించిన అధికారులు, మంగళవారం ఉదయం మళ్లీ భారీ పోలీసు బందోబస్తు మధ్య బస్తీకి చేరుకొని సుమారు ఆరు నిర్మాణాలతో పాటు కొన్ని షెడ్లు, బేస్మెంట్లను కూల్చి వేశారు. ఇండ్లలోని సామాను ఖాళీ చేయించి మరి కూల్చివేతలు చేపడుతుండటంతో అధికారుల తీరుపై స్థానికులు అసహనం వ్యక్తంచేశారు.
కనీసం చెప్పకుండానే కూల్చివేతలు చేపడితే తమ బతుకులు ఏం కావాలని బాధితులు విలపించారు. కూలీనాలీ చేసుకుని జీవిస్తున్న తమను ఇలా ఇబ్బందుల పాలు చేయడం తగదన్నారు. కాగా, కొద్దిగా గడువు ఇయ్యాలని, ప్రభుత్వ పెద్దలతో తాము మాట్లాడతామని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎమ్మార్వోకు విజ్ఞప్తి చేయడంతో.. కూల్చివేతలకు విరామం ఇచ్చారు. అయితే సర్వేనెంబర్ 334లో ఇటీవల నిర్మించిన వివాదాస్పద భవనానికి సంబంధించి కూల్చివేతకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో దాని వెనకే ఉన్న పలు ఇండ్లను తొలగించారు.