దుండిగల్, జూన్ 12: ఇంటిస్థలంపై బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు విచారణకు వెళ్లగా విసిగి వేసారిన బీఆర్ఎస్ నాయకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఒక్కసారిగా కలకలం సృష్టించిన ఈ ఘటన గాజుల రామారం నెహ్రూనగర్ సమీపంలో జరిగింది. అయితే అక్కడే ఓ డ్రమ్ములో ఉన్న నీటిని బీఆర్ఎస్ నేతపై గుమ్మరించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ మండలం, గాజులరామారంలోని సర్వేనంబర్ 219, 79 సరిహద్దు ప్రాంతంలో ఫిరోజ్ అనే బీఆర్ఎస్ నాయకుడికి సుమారు 150 గజాల ఇంటిస్థలం ఉంది. దీనిపై గత కొంతకాలంగా వివాదం నెలకొంది.
సర్వేనంబర్ 79 లో ప్రభుత్వభూమిని ఆక్రమించాడని ఓ బీజేపీ నేత సోషల్‌మీడియా వేదికగా పలుమార్లు ఫిర్యాదు చేయడం,దాని ఆధారంగా రెవెన్యూ అధికారులు విచారణకు వెళ్లడం పరిపాటిగా మారింది.ఈ నేపధ్యంలో శుక్రవారం మద్యాహ్నం మరో సారి కుత్బుల్లాపూర్ మండలం గిర్ధావర్(ఆర్ఐ)కలీం,జీపీవో విజయ్‌తో కలిసి ఫిరోజ్ ఆధీనంలో ఉన్న ఇంటిస్థలం విషయమై విచారణకు వెళ్లారు.అక్కడే ఉన్న ఫిరోజ్ అధికారులకు కావలసిన సమాచారం వివరించాడు. అయినప్పటికీ అధికారులు వినకుండా తహసీల్దార్‌ను కలవాలని చెప్పడంతో మనస్థాపం చెందిన ఫిరోజ్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.దీంతో అధికారులు ఫిరోజ్‌ను వారించి,అక్కడే ఓ డ్రమ్ములో ఉన్న నీటిని ఫిరోజ్‌పై గుమ్మరించి,అక్కడి నుండి వెళ్లి పోయారు.అనంతరం ఫిరోజ్‌పై జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆర్ఐ కలీం తెలిపారు.
2006 నుండి ప్రస్తుత కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ అనుచరుడిగా బీఆర్ఎస్లో పనిచేస్తున్నందునే బీజేపీ చెందిన నల్లా జయశంకర్‌గౌడ్ అనే వ్యక్తి నన్ను పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నాడని ఆరోపించారు.నెహ్రూనగర్‌లో ప్రస్తుతం నాకు ఉన్న ఇంటిస్థలానికి సంబందించిన అన్నిరకాల లీగల్ డాక్యూమెంట్స్ 2009 నుండే మా కుటుంబీకుల పేరిట ఉన్నాయి. సదరు ఇంటి స్థలం రిజిస్ట్రేషన్‌తో పాటు ఇంటినెంబర్, హౌస్ టాక్స్, నలా ్లబిల్లులు,కరెంట్ బిల్లు వంటి అన్నిరకాల పత్రాలు ఉన్నప్పటికీ గడచిన కొంతకాలంగా అధికారులతో కలిసి వేధిస్తున్నాడు.
ఇప్పటికే పదిసార్లు ఈ ఇంటిస్థలానికి సంబంధించిన అన్ని డాక్యూమెంట్స్(పత్రాలు) రెవెన్యూ కార్యాలయంలో అధికారులకు అందజేశాను.అయినప్పటికీ అధికారులు తరచూ నా ఫ్లాట్వద్దకు విచారణ పేరుతో వచ్చి నన్ను, నా పరువు తీయాలని చూస్తున్నారు.అతను ఎవరో ఫేస్బుక్లో ఆరోపణలు చేస్తే అధికారులు వేధించడం ఏమిటీ…? వీరు పెట్టే టార్చర్ భరించలేకే ఆత్మహత్యాయత్నం చేసానని ఫిరోజ్ చెప్పారు.