సిటీ బ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఈ వెంకటాచారి అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోని సరోజిని నాయుడు వనిత మహా విద్యాలయంలోని శంకర్ జీ ఆడిటోరియంలో శుక్రవారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలు మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు 244 కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు.
వీరిలో ప్రథమ సంవత్సర విద్యార్థులు 85,753 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 93,465 మంది, మొత్తం 1,79,218 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు తాగునీరు, టాయిలెట్స్, మెరుగైన శానిటేషన్ సరైన ఫర్నిచర్, వైద్య సౌకర్యాలు ఉండేలా చూడాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే పరీక్షలకు హైదరాబాద్ లో ట్రాఫిక్ దృష్ట్యా విద్యార్థులు ఉదయం 8 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు.
సంబంధిత అధికారులు కేటాయించిన విధులను అత్యంత జాగ్రత్తతో అప్రమత్తంగా నిర్వహించాలని ఆదేశించారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంటాయని, ప్రశ్నాపత్రాల కవరు సీల్ తీయటం, జవాబు పత్రాలను కవరులో ఉంచి సీల్ వేయడం సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుందని స్పష్టం చేశారు. చీఫ్ సూపరిండెంట్ కి తప్ప మిగతా వారికి మొబైల్ ఫోన్ అనుమతి లేదన్నారు. విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 040 29700934 ను సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డీ ఒడ్డెన్న, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్మెంటల్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.