ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 9: ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం పర్యటించి, బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న ఈ సభకు ఇప్పటికే అధికారులు, పోలీసులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో ఓయూలో పర్యటించిన ముఖ్యమంత్రి డిసెంబర్లో నెలలో మళ్లీ ఓయూకు వస్తానని, ఒక్క పోలీసు కూడా లేకుండా సభ నిర్వహించడంతో పాటు వర్సిటీ అభివృద్ధికి అవసరమైతే రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తానని అట్టహాసంగా ప్రకటించారు.
అయితే సభ నిర్వహించే రోజు రానేవచ్చింది. సీఎం ఇచ్చిన మాట నిలుపుకుంటారా అనే చర్చ ఇప్పుడు వర్సిటీలో హాట్ టాపిక్‌గా మారింది. సీఎం చెప్పిన మాటలకు భిన్నంగా ఇప్పటికే సభా ప్రాంగణం భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. దీంతో సీఎం మాటలు కేవలం గప్పాలకే అని మరోసారి రుజువైంది. ఇక ఓయూ అభివృద్ధికి నిధులు ప్రకటించడంతో సరిపెట్టకుండా.. మంజూరు చేసి చూపాలని ఉద్యోగులు, విద్యార్థులు కోరుతున్నారు.
వెయ్యికోట్లపై గంపెడాశలు
రేవంత్ సర్కార్‌లో సంవత్సర కాలంగా మీడియా ప్రతినిధులకు పదేపదే అవమానం ఎదురవుతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి పాల్గొనే సభలో కూడా మీడియాకు ఎలాంటి పాసులు జారీ చేయకుండా ఐడీ కార్డుతో వస్తే చాలని పేర్కొనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాగే ఆగస్టులో జరిగిన ఓయూ స్నాతకోత్సవంలో అధికారులు జారీ చేసిన పాసులతో వెళ్తే మీడియా ప్రతినిధులను భద్రతా సిబ్బంది నిలిపివేశారు. కిలోమీటర్ దూరాన వాహనాలను నిలిపేసి కాలినడక అనుమతించడంతో పాటు మధ్యలో 6 సార్లు తనిఖీలు చేశారు. వాటన్నింటినీ దాటుకుని ఆడిటోరియం వద్దకు చేరుకున్న వారిని అనుమతి లేదంటూ బయటే నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన మీడియా ప్రతినిధులు సీఎం భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో అక్కడే ఉన్న పోలీసు అధికారులు కల్పించుకుని వారిని లోపలికి అనుమతించారు. అయితే ఈసారి కనీసం ఆ పాసులు కూడా ఇవ్వకపోవడంపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.