యాభైఏండ్లు పాలించి రైతులకు ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీ.. వ్యవసాయం పై చేస్తున్న వ్యాఖ్యలకు రైతాంగం భగ్గుమంటోంది. కరెంట్‌ను మూడుగంటలు చేస్తాం.. 10హెచ్‌పీ మోటర్లు పెడతామంటూ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మూడు గంటల కరెంటుతో ఒక్క మడి కూడా సరిగా పారుతుందా ? అని రైతులు వాపోతున్నారు. ధరణి ఎత్తేసి పాత రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తామంటున్నారు. మళ్లీ కౌల్దారీ విధానం, ఆఫీసుల చుట్టూ తిరిగే వ్యవస్థను తీసుకొస్తారా? మా భూములు కబ్జా రాయుళ్లకు అప్పగిస్తారా? అంటూ కాంగ్రెస్ పార్టీ తీరుపై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ధరణితో భూములు భద్రంగా ఉన్నాయని, కేసీఆర్ పాలనలో రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి సాయం అందుతున్నది.. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మేలును ఓర్వలేకే కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు చేస్తోందని అన్నదాతలు భగ్గుమంటున్నారు.
కాంగ్రెస్‌ను నమ్ముకుంటే రైతులకు కష్టాలే మిగులుతాయి. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచిగా ఉన్న ధరణిని తీసేస్తామంటూ ఆ పార్టీ పెద్దలు చెప్పడం బాధాకరం. మళ్లీ పాత రెవెన్యూ వ్యవస్థ తీసుకొస్తరు. ఏ పని కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తది. మన భూమి మన మీదనే ఉండదు. కేసీఆర్ సారు తీసుకొచ్చిన ధరణితో తిప్పలు తప్పినయి. మా మద్దతు బీఆర్ఎస్ ప్రభుత్వానికే.
– కె.లక్ష్మారెడ్డి, రాంపల్లి, నాగారం మున్సిపాలిటీ
కాంగ్రెస్ అంటున్న మూడు గంటల కరెంట్‌తో వేసిన పంటలన్నీ ఎండిపోతయి. గతంలో వారి పాలనలో రాత్రింభవళ్లు పొలాల దగ్గర కరెంట్ కోసం కాపు కాసినం. రైతు ఆరుగాలం కష్టపడ్డ తగిన ఫలితం దక్కదు. రైతులను పట్టించుకోని కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆ ఓట్లు మట్టిలో పోసినట్టే అవుతుంది. గతంలో రైతులు పడ్డ గోసలను సీఎం కేసీఆర్ వచ్చినంక తీర్చిండు. రైతులకు 24 గంటల కరెంట్‌ను ఇచ్చి అండగా ఉన్నాడు. సీఎం కేసీఆర్‌ను తప్ప మేము ఇంకా కాంగ్రెస్‌ను నమ్మే స్థితిలో లేము.
– పినింటి దేశమంత్రెడ్డి, రైతు, కీసర
కాంగ్రెస్ ధరణిని తీసేసి పాత రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తమంటున్నది. రైతులను మళ్లీ ఆఫీసుల చుట్టు తిప్పదలుచుకున్నరా. పహాణీలు , రికార్డులు కావాలన్నా, రికార్డులు మార్చాలన్నా ఆఫీసుల చుట్టు తిరగాల్సిన పరిస్థితులొస్తయి.కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చిన తర్వాత రైతులకు మంచి రోజులొచ్చాయి. ధరణిలో రికార్డులు భద్రంగా ఉన్నాయి. మన వేలిముద్ర వేస్తేనే రికార్డులు మారుతాయి. ఒక్క రోజులోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్. రైతులకు మేలు చేస్తున్న వారి వైపే మేముంటం.
– కే.బాల్‌రాజ్, బాబాగూడ శామీర్‌పేట మండలం
సీఎం కేసీఆర్ ప్రతి పేదవాడి భూమి భద్రంగా ఉండాలని ధరణి పోర్టల్‌ను తీసుకురావడం సంతోషంగా ఉంది. ధరణి తీసేస్తే రైతుల భూ రికార్డులు ఆగమవుతయి. భూ కబ్జాలు చేయాలంటే ధరణి అడ్డం వస్తుందని, తొలగిస్తే సమస్య ఉండదని నీచమైన ఆలోచనలో ఉండటం సిగ్గుచేటు. పేరు మార్చాలన్న, పట్టా కావాలన్న దళారుల వద్దకు పోవాల్సి వస్తది. కాంగ్రెస్ వస్తే రైతులకు కష్టాలు దాపురించినట్టే. రైతులకు ఇబ్బందులు తప్పవు. ధరణి కొన సాగాలి..కేసీఆర్ మళ్లీ రావాలి.
– జనార్దన్, రైతు, మల్కారం, జవహర్‌నగర్
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇవ్వడం సరికాదని కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడు ఉన్న మోటర్లు బాగా పనిచేస్తున్నాయి.10 హెచ్‌పీ పెద్ద మోటర్లు రైతులకు ఎవరిస్తరు. రైతులు ఆర్థికంగా నష్టపోతరు. పొలాలు బీళ్లుగా వదిలేయడమో..కొత్తగా బోర్లు వేసి నష్టాల పాలవడమో జరుగుతుంది. మళ్లీ అప్పులపాలు చేసే కాంగ్రెస్ విధానాలు మా నెత్తిన రుద్దొద్దు. కేంద్ర ప్రభుత్వం బోర్లకు మీటర్లు పెట్టమని చెప్పినా కేసీఆర్ అడ్డుకున్నడు. అందుకే రైతులంతా కేసీఆర్‌నే మళ్లీ గెలిపించాలి.
– ఉమాశంకర్, జిన్నారం
ఈ కాంగ్రెసోళ్లకు పనిపాట ఉండదు. రైతులకు తలనొప్పిగా మారుతున్నారు. రైతులకు 3 గంటల కరెంటు సరిపోతది అనడం తప్పు. వారి గత పాలనలో నా కష్టాలు పడ్డం. రాత్రింభవళ్లు తేడా లేకుండా బాయికాడికి పోయి రావాలంటే నరకం కనిపిస్తుండే. పురుగుబూషి భయంతో నిద్రమబ్బులో ఏమైతదో తెలవని పరిస్థితులను చూడలేదా?. 24 గంటల కరెంటుతో చేనుకు సరిపోను నీళ్లు పారవెట్టుకుంటున్నం. 3 గంటల కరెంటుతో ఒక్క మడి కూడా పారదు. బీఆర్ఎస్ ప్రభుత్వానికే మా మద్దతు.
– వల్లపు రాంచందర్, ఉప్పర్‌పల్లి
కాంగ్రెస్‌కు ఓటుతోనే బుద్ధి చెబుతాం. రైతాంగం కోసం ఇంత చేసిన సీఎం కేసీఆర్‌ను వదులుకోం. అన్నదాతల కోసం అనేక పథకాలను తీసుకొచ్చిన కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు నేడు చాలా సంతోషంగా ఉన్నారు. రైతులను మోసం చేయడానికి కాంగ్రెస్ లేనిపోని ఆశలు చూపిస్తోంది. కాంగ్రెస్ వస్తే రైతులు అప్పులపాలు కావడం ఖాయం. 3 గంటల కరెంట్, 10 హెచ్‌పీ మోటర్లతో రైతులకు అంతా నష్టమే. ఆ పార్టీని నమ్మం. మళ్లీ సీఎం కేసీఆర్‌కు ఓట్లేసి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాం.
– మెట్టు పరమేశ్ యాదవ్, రైతు, కీసర
ధరణి తీసేస్తే దళారుల రాజ్యమొస్తది. కాంగ్రెస్ నాయకులు పబ్బం గడుపుకోవడానికే మాయ మాటలు చెబుతున్నరు. రికార్డులు, పహణీ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాలి. అధికారులు అందుబాటులో ఉండరు. మళ్లీ పాత రోజులు వస్తయి.సీఎం కేసీఆర్ అమలు చేసిన ధరణితో గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు తీరాయి. రైతులు చాలా సంతోషంగా ఉన్నరు. భూములు కబ్జాలకు గురి కాకుండా పూర్తి రక్షణ దొరికింది. పంటల పెట్టుబడికి రైతుబంధు ఇస్తున్నడు. రైతులమంతా బీఆర్ఎస్ ప్రభుత్వానికే అండగా ఉందాం.
– గండు శ్రీకాంత్‌యాదవ్, రైతు, కీసరదాయర