సిటీబ్యూరో, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంపై కుట్ర జరుగుతోందా.. వరద వస్తుందని వారం ముందే సమాచారం ఉన్నా.. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లలో పూర్తి సామర్థ్యంలో నీటిని ఎందుకు నిల్వ చేశారు.. 2023 సంవత్సరంలో కూడా 38,500 క్యూసెక్కుల ప్రవాహం నమోదైనప్పటికీ ఎంజీబీఎస్ ఎందుకు మునగలేదు. 34వేల క్యూసెక్కులకే ఎందుకు మునిగింది. ఎక్స్ వేదికగా ఓ నెటిజన్ సందేహమిది..
టైల్స్ వేస్తున్నారటగా రంగనాథ్గారు.. హ్యాపీ ఆ.. హైడ్రా అమ్ముడు పోయిందా.. అంటూ పోకిరీ సినిమా డైలాగ్‌ను గుర్తుచేస్తూ నెటిజన్లు హైడ్రా తీరును విమర్శిస్తున్నారు. మూసీ నదిలోనే ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఇంత పెద్ద భవనం కడుతుంటే రంగనాథ్ ఎందుకు మౌనం వహిస్తున్నారని, ఆయనకు బడానిర్మాణ సంస్థల ఆక్రమణలు కనిపించవా.. వాళ్లతో సీక్రెట్ డీల్ చేసుకున్నారా అంటూ ప్రశ్నించి స్కేర్ ఫీట్‌కు రూ.150లు లంచమా.. నార్సింగిలో ఆదిత్య-ఆలేఖ్య కన్స్ట్రక్షన్స్ కడుతున్న భవనం మీదకు జేసీబీలు పంపే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అంటూ మరో నెటిజన్ సిఎంపై, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు సవాల్ విసిరారు.
హీరో నాగార్జున తమ్మడి కుంట చెరువును ఎన్కన్వెన్షన్ పేరుతో కబ్జా చేస్తే మా పాత పరిచయాల వల్ల ఆయనను నేను అడిగితే ఆ భూమి వద్దని ప్రభుత్వానికి ఇచ్చేసిండని బతుకమ్మ కుంట ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలకు కౌంటర్‌గా నాగార్జున సరే.. మరి మీ బ్రదర్ తిరుపతి రెడ్డి ఎఫ్టీఎల్లో కట్టిన తన ఇంటిని కూల్చేసుకోకుండా ఎందుకు కోర్టుకు వెళ్లాడంటూ ఓ నెటిజన్ సీఎంను ప్రశ్నించారు.
మూసీ వరదలతో హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది.
పలు బస్తీలు, పాతబస్తీలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. మునుపెన్నడూ లేనివిధంగా వచ్చిన వరదలకు తమను అప్రమత్తం చేయాల్సిన అధికార యంత్రాంగం తమవైపే చూడలేదని, దీని వెనక ఏదో కుట్ర దాగుందని వరదబాధితులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వారు మూసీ గర్భంలో నిర్మిస్తున్న భవనాలపై రేవంత్ సర్కార్, హైడ్రా వ్యవహరిస్తున్న తీరును సోషల్ మీడియావేదికగా నెటిజన్లు ఎండగడుతున్నారు. బతుకమ్మ కుంట ప్రారంభోత్సవంలో మూసీ సుందరీకరణపై పెద్ద ఎత్తున ప్రకటనలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ఆదిత్య భవనాలు, తమ మంత్రులు, సోదరుల కబ్జాలు కనిపించడం లేదా.. వాటిని కూల్చేసే దమ్ముందా అంటూ ప్రశ్నిస్తున్నారు.
మూసీ గర్భంలోనే ఆదిత్య కన్స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న భవనాలు హైడ్రాకు కనిపించవా.. వారితో ఏదైనా సీక్రెట్ డీల్ కుదిరిందా అంటూ హైడ్రాపై విమర్శలు గుప్పిస్తున్నారు. చెరువులు ఆక్రమించారంటూ సామాన్యుల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపే హైడ్రాకు వారు తీసిన డ్రోన్లలోనే మూసీ గర్భంలో కనిపించిన ఆదిత్యపై ఎందుకింత ప్రేమ అంటూ సందేహాలు వెలిబుచ్చుతున్నారు. ముఖ్యంగా సున్నంచెరువు లాంటి చాలాచోట్ల ఇంకా హద్దులు ఖరారు కాకముందే ఇళ్లను నేలమట్టం చేసిన హైడ్రాకు నదిలో కనిపిస్తున్న ఆదిత్య భవనాలతో ఏం దోస్తీ కట్టారంటూ ప్రశ్నిస్తున్నారు.
తమ్మిడికుంటను కబా ్జచేశారంటూ ఎన్‌కన్వెన్షన్‌ను కూల్చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ తర్వాత చాలా వేదికలపై తాము పెద్దోళ్ల జోలికి కూడా పోతామంటూ చెప్పుకోవడానికి నాగార్జున కబ్జానే ప్రతీసారి ఉదాహరణగా చెప్పుకొంటున్నారు. అయితే బతుకమ్మకుంట ప్రారంభోత్సవంలో హైడ్రాను ఆకాశానికెత్తిన సీఎం నాగార్జున తాను కబ్జా చేసిన భూమిని తిరిగి ఇచ్చాడంటూ చేసిన కామెంట్లపై సోషల్‌మీడియాలో పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు. తెలంగాణ ప్రజలుగా తిరుపతిరెడ్డి అతని ఇంటిని, పొంగులేటి ఫామ్ హౌజ్‌ను హైడ్రాతో కూల్చేయించాలని కోరుకుంటున్నామని కొందరు అంటుంటే ఒవైసీ కాలేజీ విషయంలో ఏం చేస్తారంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
మొన్న మూసీకి వచ్చిన వరదలపై ఇప్పటికే నగర ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంటే మరోవైపు నెటిజన్లు కూడా అదే స్థాయిలో ప్రభుత్వం హైడ్రాతో కలిసి కుట్రచేస్తున్నదంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. హైదరాబాద్ నగరంపై కుట్ర జరుగుతోందా.. అంతకుముందు నీళ్లు వదిలితే ముందస్తు హెచ్చరికలు జారీ చేసే సర్కార్ యంత్రాంగం ఇప్పుడెందుకలా మౌనం వహించిందంటూ ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా హైడ్రా తమకు మూసీ సుందరీకరణతో సంబంధం లేదని ప్రకటిస్తూనే మూసీ ఆక్రమణల విషయంలో చర్యలుంటాయని రంగనాథ్ ప్రకటించడం వెనక మూసీ సుందరీకరణ పేరుతో లక్షల కోట్లు కొట్టేసే కుట్ర చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మూసీకి అకస్మాత్తుగా ఎందుకు వరద వచ్చిందని, జంటజలాశయాల విషయంలో నీరు కిందకు వదిలేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారా అంటూనే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం వరద వస్తుంది. ప్రాజెక్టులో 68 శాతం మాత్రమే నీటిని నిల్వ ఉంచి, ముందస్తుగా రిజర్వాయర్‌ను ఖాళీ చేశారు.
మరి జంట జలాశయాలను ముందస్తుగా ఎందుకు ఖాళీ చేయలేదనే ప్రశ్న వేస్తున్నారు. హైడ్రా పేరుతో మూసీ సుందరీకరణను సమర్థించడానికి లక్ష కోట్లు తినడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రగా నెటిజన్లు మండిపడుతున్నారు. అది వాన తెచ్చిన వరద కాదని, ఆర్ఆర్ తెచ్చిన వరద అంటూ మరో సోషల్‌మీడియా వారియర్ ఫైరయ్యారు. వెథర్‌మ్యాన్ బాలాజీ ముందుగానే హెచ్చరించినా వాతావరణశాఖ ముందస్తుగా హెచ్చరించినా ప్రభుత్వశాఖలు ప్రత్యేకించి హైడ్రా తదితర డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఎందుకు చక్కగా పనిచేయలేదని, అసలు వారి నిర్లక్ష్యానికి కుట్ర కోణమే కారణమా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.