ఖైరతాబాద్, నవంబర్ 7 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ముస్లింల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆలిండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ ముస్లిం ఫౌండేషన్ తీవ్రంగా ఖండించింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫౌండేషన్ అధ్యక్షుడు, విశ్రాంత మేజర్ ఎస్జీఎం ఖాద్రీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడుస్తున్నా మైనారిటీల కోసం చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏర్పాటైన ఏ ఒక్క కమిటీ ముస్లిం అభివృద్ధి కోసం ఒక్క పనికూడా చేయలేదన్నారు.
ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని, మూడో వేతన సవరణ కమిషన్ సిఫారసు అమలు చేయడం మరిచిపోయారని, పింఛన్ ప్రయోజనాలు అందడం లేదన్నారు. ఓ వైపు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ‘మోహబ్బత్ కిదుకాన్’ అని వ్యాఖ్యానిస్తే ఆయన నియమించిన ముఖ్యమంత్రి మాత్రం మైనారిటీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ఉంటేనే ముస్లింల ఇజ్జత్ ఉంటుందని సీఎం వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాహుల్ గాంధీ సరైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోలేదన్నారు. ముస్లింలకు కాంగ్రెస్ అవసరం లేదని, తమ ఓట్లతో గెలిచిన కాంగ్రెస్‌కే ముస్లింల అవసరమున్నదని తెలిపారు.
సీఎం వ్యాఖ్యలు దేశంలోని ముస్లింలందరిని అవమానించినట్లేనన్నారు. ముస్లింలు తలచుకుంటే ప్రభుత్వం కూలిపోతుందన్నారు. దీనిపై ఏఐసీసీలు నేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ స్పందించాలని, సీఎం చేత క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఒక్క ఓటు కూడా వేయమని, తమ మద్దతు బీఆర్ఎస్కే ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో సామాజిక కార్యకర్త గియాసుద్దీన్ అక్బర్, ప్రొఫెసర్ షాహిదా, రిటైర్డ్ ప్రొఫెసర్ మాను, సనావుల్లా ఖాన్, ఫారూఖ్ అలీ, ఖాజా మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.