సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం జీహెచ్ఎంసీలో అమలుకు నోచుకోలేదు. ఈ నెల 7న అగ్రి వర్సిటీ బోటానికల్ గార్డెన్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని అట్టహాసంగా సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. అయితే ఐదు రోజులు గడిచినా.. జీహెచ్ఎంసీ అధికారికంగా వన మహోత్సవాన్ని ప్రారంభించకపోవడం గమనార్హం. వాస్తవంగా ప్రభుత్వం కార్యక్రమం తీసుకున్న వెంటనే తక్షణమే అమలు చేయాల్సిన అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ఈ దిశగా సన్నద్దం కాకపోవడం వారి పనితీరుకు అద్దం పడుతున్నది.
ఇప్పటికే గడిచిన 18 నెలల కాలంలో గ్రేటర్లో కొత్తగా ఒక్కటంటే ఒక్క పార్కునూ అభివృద్ధి చేయకుండా ఉన్న ఈ విభాగం..వన మహోత్సవం కార్యక్రమాన్ని కంటి తుడుపు చర్యగా తీసుకున్నది. ఈ ఏడాది జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం 25.52 లక్షల మొక్కలతో ముగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కూకట్పల్లి, ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్ జోన్లకు ఆయా నిర్దేశిత లక్ష్యాలను ఖరారు చేసింది. రహదారుల వెంబడి, సెంట్రల్ మీడియన్, కాలనీలు, పార్కులు, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో విరివిరిగా మొక్కలు నాటాలని నిర్ణయించింది.
అయితే వన మహోత్సవ కార్యక్రమాన్ని అధికారిక ప్రారంభోత్సవంలోనే తడబడుతుండడం వెనుక పచ్చదనం పెంపులో తమకున్న చిత్తశుద్ధికి అద్దం పడుతుందని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్లో అంచనాల్లో అర్బన్ బయోడైవర్సిటీ విభాగానికి నిధులు కేటాయించలేదు. నిధుల కారణంగానే వన మహోత్సవం ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. అధికారికంగా వన మహోత్సవం కింద తక్షణమే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని పర్యావరణవేత్తలు, పౌరులు డిమాండ్ చేస్తున్నారు.