సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పథకాలను ఆనవాళ్లు లేకుండా చేస్తామన్న రేవంత్ సర్కారుకు క్షేత్రస్థాయిలో అసాధ్యం కాదని తేలిపోయింది. ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ పథకాలను స్థానంలో హెచ్ సిటీ ప్రాజెక్టును తెరపైకి తీసుకువచ్చి..పాత ప్రతిపాదనలనే పట్టాలెక్కిస్తున్నది. తాజాగా కాంప్రెహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ) పథకాన్ని తిరిగి కొనసాగించేందుకు సిద్దమైంది. ఎల్లవేళలా సాఫీ ప్రయాణానికి అనువుగా ఉండాలనేది సీఆర్ఎంపీ లక్ష్యం. ప్రధాన రహదారుల నిర్వహణలో భాగంగా 510 విభాగాలుగా విభజించి తొలి విడతగా 744 కిలోమీటర్ల రహదారిని 2020 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ ఎజెన్సీలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. నిర్ణీత గడువులో మొదటి విడతను పూర్తి చేసి గుంతలు లేని నగరంగా తీర్చిదిద్దింది. ఈ సీఅర్ఎంపీ విధానం ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలిచింది.
ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే సీఆర్ఎంపీ మోడల్ వివరాలను తీసుకోగా.. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌కు చెందిన పలు కార్పొరేషన్లు పురపాలక శాఖను సంప్రదించారు. ఇటువంటి పథకాన్ని కొత్త ప్రభుత్వం సాగనీయకపోవడంపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మొదటి విడత పథకం నిర్వహణను మళ్లీ ప్రైవేట్ ఎజెన్సీలకు అప్పగించడంతో పాటు కొత్తగా రెండవ విడతలో రూ. 424 చోట్లకుగానూ 398.32 కిలోమీటర్ల మేరలో రూ.1334 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశారు. రెండు విడతలు కలిపి 934 ప్రాంతాల్లో 1142.54 కిలోమీటర్ల మేరలో రూ.3825 కిలోమీటర్లలో సీఆర్ఎంపీ రోడ్ల నిర్వహణ ప్రతిపాదనలు సిద్దం చేసిన అధికారులు రేపు (గురువారం) జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశం ముందుకు తీసుకురానున్నారు. సీఆర్ఎంపీ పథకం ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదిస్తారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.