సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): ఎయిర్పోర్ట్ మెట్రో.. కేసీఆర్ ప్రభుత్వం సాంకేతికంగా కొలిక్కి తెచ్చి రూ.6,250 కోట్లతో శంకుస్థాపన చేసి పట్టాలెక్కించిన కీలకమైన మెట్రో ప్రాజెక్టు. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చీరాగానే రద్దు చేసింది. ఈ రెండింటికీ ప్రత్యక్ష సాక్షి హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి. కాంగ్రెస్ సర్కారు ఆ ప్రాజెక్టును కొనసాగించి ఉంటే చివరి దశలోకి వచ్చి రేపోమాపో అందుబాటులోకి వచ్చేది. హైదరాబాద్ మెట్రో విస్తరణ అనేది మరో 31 కిలోమీటర్లు పెరిగేది. కానీ ఎన్వీఎస్రెడ్డి ఈ వాస్తవాన్ని విస్మరించారు… పదేండ్ల కాలంలో ఏమీ జరగలేదంటున్నారు.
అదే సమయంలో ఏడాదిన్నరగా హైదరాబాద్ నగరంలో ఒక్కటంటే ఒక్క కొత్త అభివృద్ధి పనుల్లో తట్టెడు పని చేయకుండా… అందునా ఏడాది కిందట మెట్రో ప్రాజెక్టుకు శిలాఫలకం వేసి నేటికీ కనీసం డీపీఆర్ పూర్తి చేయని కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టును ఏదో పరుగులు పెట్టిస్తుందనే రీతిలో వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఎండీ వ్యాఖ్యలు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రీతిలో ఉన్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అంతేకాదు… కేసీఆర్ హయాంలో ఇదే ఎన్వీఎస్రెడ్డి వ్యాఖ్యల వీడియోను జత చేసి ఆయన ద్వంద్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తప్పుపట్టిన నెటిజన్లు
మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి ఇటీవల ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పదేండ్ల కాలంలో మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి కేవలం ప్రతిపాదనలేగానీ పనులు మాత్రం జరగలేదని వ్యాఖ్యానించారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్టు చేసిన నెటిజన్లు ఆయన తీరును తప్పుబట్టారు. వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒకవైపు వూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ) కింద భారీ ఎత్తున ఫ్లైఓవర్లు, ఇతరత్రా నిర్మాణాలను పూర్తి చేస్తూనే ఇంకోవైపు బృహత్తర మెట్రో ప్రాజెక్టుల్ని కూడా ముందుకు తీసుకుపోయేందుకు తీవ్రస్థాయిలో కృషి చేశారు.
కానీ బెంగళూరు, ఇతర మెట్రో నగరాలకు సహకారం అందించిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కించిత్తు సాయం కూడా చేయలేదు. అయినప్పటికీ కేంద్రంపై ఆధారపడకుండా మెట్రో ప్రాజెక్టుల్నిచేపట్టేందుకు కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగానే ఎయిర్‌పోర్టు మెట్రోను పట్టాలెక్కించారు. టెండర్లు, శంకుస్థాపన ఈ దశలన్నీ దాటి… క్షేత్రస్థాయిలో సర్వే కూడా దాదాపుగా పూర్తయింది. దీంతో పాటు హైదరాబాద్ మహా నగర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సుమారు మరో 325 కిలోమీటర్ల మెట్రో ప్రతిపాదనలకు సైతం కేసీఆర్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరి…
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అటు ఎయిర్‌పోర్టు మెట్రోను రద్దు చేయడంతో పాటు కేసీఆర్ ప్రభుత్వంలో క్యాబినెట్ ఆమోదం పొందిన ప్రతిపాదనల్ని పక్కనపెట్టి… కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా హడావుడి చేసిన ప్రభుత్వం శంకుస్థాపన చేసిందేగానీ ఇప్పటివరకు డీపీఆర్‌ను కూడా పూర్తి చేయలేకపోయింది. పైగా జన సంచారమే లేని ఫోర్త్ సిటీ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో అనుసంధానం చేసేలా డీపీఆర్‌ను సిద్ధం చేసింది. ఈ విషయాలన్నీ తెలిసిన మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మెప్పు కోసం ఇలా వ్యాఖ్యలు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రెండు నాల్కల ధోరణి
బీఆర్ఎస్ హయాంలో తొలి దశ మెట్రో అందుబాటులోకి వచ్చిన సమయంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, తన పదవీ కాలం పొడిగించిన తర్వాత బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలతో ఆయన రెండు నాల్కల ధోరణిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అదే ఇంటర్వ్యూలో తన పనితీరును గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు అందరూ మెచ్చుకున్నారని గొప్పులు చెప్పుకోవడం, అందులో మాజీ సీఎం కేసీఆర్ పేరును కూడా ప్రస్తావించిన ఎన్వీఎస్ రెడ్డి… ఇప్పుడేమో పార్టీ కండువా కప్పుకున్న రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్న తీరును తప్పుబడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్వీఎస్ చెప్పిన మాటలు… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న వ్యాఖ్యలను కలిపి సోషల్ మీడియాలో పంచుతూ… మారిన మాట తీరును ఎండగడుతున్నారు.