సిటీబ్యూరో/అమీర్‌పేట ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల బతుకులు చిధ్రమవుతున్నాయి. ప్రజా పాలన అంటూ ప్రగల్భాలు పలికే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. పార్లమెంట్ చేసిన వీధి వ్యాపారుల (జీవన ఉపాధి రక్షణ, క్రమబద్ధీకరణ) చట్టం 2014ను పూర్తిగా నీరుగార్చింది. చిరు వ్యాపారుల హక్కులను కాపాడాల్సిన సర్కారే ఇప్పుడు వారి పొట్ట కొట్టడానికి బుల్డోజర్లను దింపుతున్నది. ఇప్పటికే హైడ్రా పేరుతో సామాన్యులను భయబ్రాంతులకు గురిచేస్తున్న రేవంత్ సర్కార్..తాజాగా వీధి వ్యాపారుల ఉపాధి గూడులను నేలమట్టం చేస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నది.
వాస్తవంగా కేంద్ర చట్టం ప్రకారం వీధి వ్యాపారులను తొలగించే ముందు సమగ్ర సర్వే నిర్వహించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. వీరికి ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా వెండింగ్ జోన్లను ఏర్పాటు చేసిన తర్వాత వారిని పాత స్థానం నుంచి మార్చాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పాలనలో ఈ నిబంధనలన్నీ గాలికి ఎగిరిపోయాయి. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా వారి వ్యాపారులను కూల్చివేసి జీవితాలను రోడ్డు పాలు చేస్తున్నది. కనీసం సామగ్రి సర్దుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా షెడ్లను కూల్చివేస్తున్న తీరు తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వెండింగ్ జోన్లను ఏర్పాటు చేస్తే.. రేవంత్ ప్రభుత్వం కొత్త జోన్లు ఏర్పాటు చేయకపోగా, ఉన్నవి నిర్వహణ చేపట్టలేకపైగా ఒకే రోజు 798 పైగా షెడ్లను తొలగించి వేలాది మంది కుటుంబాలను రోడ్డున పడేశారు. నాడు కేసీఆర్ ప్రభుత్వం ఆదుకున్నదని..నేడు రేవంత్‌రెడ్డి మేం తినే కంచంలో మట్టి పోస్తున్నారంటూ బాధిత వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ తీరుపై విమర్శల వెల్లువ
వీధి వ్యాపారుల చట్టానికి జీహెచ్ఎంసీ తూట్లు పొడిచింది. వ్యాపారాలు కొనసాగించే జోన్లను గుర్తించి స్వేచ్ఛగా విక్రయాలు సాగించుకునేందుకు అవకాశం కల్పించాల్సిన అధికారులు ..అనర్హులకు కొమ్ముకాస్తున్నారు. వీధి వ్యాపారులకు ఎటువంటి నష్టం జరగకుండా రక్షణ కల్పించాల్సిన చోట కొందరు అధికారులు రాజకీయ నాయకులకు దాసోహమవుతున్నారు. ఫలితంగా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లు అన్హరులు, అధికారులు కలిసి అక్రమ దందాకు తెరలేపారు. సనత్‌నగర్ ప్రధాన రహదారి కేంద్రంగా స్ట్రీట్ వెండర్ జోన్ అక్రమారులకు అడ్డాగా మారింది. వీధి వ్యాపారులతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులు చేతుల్లో ఈ దందా మూడు పువ్వులు..ఆరు కాయలు అన్నట్లు సాగుతున్నది.
కొత్త జోన్లు లేవు..
నిరంతరం వ్యాపారాలు చేసుకునే జోన్లు (గ్రీన్ జోన్ ), పాక్షికంగా ఎంపిక చేసిన సమయాల్లో మాత్రమే వ్యాపారాలు చేసే జోన్లు (యాంబర్ జోన్ ), వ్యాపారాలు నిషేధించిన జోన్లు (రెడ్ జోన్ )గా ఎంపిక చేయాలి. స్ట్రీట్ వెండర్స్ గా గుర్తించిన వారికి గుర్తింపు కార్డులను అందించారు.. తోపుడు బండ్ల నిర్వాహకులు, ఎలక్ట్రిషీయన్లు, రోడ్ల వెంబడి దుకాణాలు, చేపలు, పండ్ల వ్యాపారాలు, టైలరింగ్ తదితర వ్యాపారులను అర్హులుగా గుర్తించి.. వారికి రూ.10వేల రుణం అందేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
వ్యాపారుల్లో ఎకువ శాతం చదువుకోని వారు ఉండడంతో వారి వ్యాపారాభివృద్ధికి జీహెచ్ ఎంసీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (యూసీడీ) విభాగం అధికారులు అవసరమైన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది..కానీ గడిచిన రెండున్నర ఏండ్లలో వీధి వ్యాపారుల అభివృద్ధికి తీసుకున్న చర్యలు పెద్దగా లేకపోగా..ఉన్న వారిని ఉన్న పళంగా ఖాళీ చేయిస్తూ.. వారి జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారు. వాస్తవంగా బీఆర్ఎస్ హయాంలో మల్లేపల్లి ఐటీఐ, మెట్టుగూడ, సనత్‌నగర్, శిల్పారామం లాంటి ప్రాంతాల్లో స్ట్రీట్ వెండర్స్ జోన్స్ ఏర్పాటు చేశారు. స్థానికంగా చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూతనందించారు. గ్రేటర్ వ్యాప్తంగా సర్వే ద్వారా 1,66,340 మంది స్ట్రీట్ వెండర్స్‌ను గుర్తించారు. వారికి గుర్తింపు కార్డులు ఇచ్చారు..మూడు విడతల్లో రుణాలు ఇచ్చి ఆదుకున్న పరిస్థితి..కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్కటంటే ఒక్కటి వీధి వ్యాపారులకు ప్రత్యేక స్ట్రీట్ వెండర్ జోన్లు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతున్నది.
ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి స్టాళ్లు..
జీహెచ్ఎంసీ గుర్తించిన వీధి వ్యాపారులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన స్టాళ్లు పక్కదారి పట్టాయి. గత బీఆర్ఎస్ హయాంలో వీధి వ్యాపారుల చేతుల్లో ఉన్న ఈ స్టాళ్లు ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లాయి. గత ప్రభుత్వంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వీధి వ్యాపారుల కోసం సనత్‌నగర్ పారిశ్రామికవాడ పార్కుకు ఆనుకుని ప్రహరీ వెంట 18 స్టాళ్లను నిర్మించి అర్హులకు అందజేశారు. కొద్ది రోజులు వీధి వ్యాపారులు వీటిని వినియోగంలోకి తెచ్చుకున్నా.. ఆ తరువాత మారిన పరిస్థితుల్లో ఇప్పుడవి పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లాయి. ప్రతి ఆదివారం సనత్‌నగర్ ప్రధాన రహదారిపై కొనసాగే అంగడిలో ఈ జీహెచ్ఎంసీ వీధివ్యాపారుల స్టాళ్లు ఒక్కోటి రూ. 2 నుంచి 4 వేలకు అద్దెకు ఇస్తుంటారు.
రెండున్నరేళ్ల కాలంలో జీహెచ్ఎంసీ నిర్మించిన స్టాళ్లకు దీటుగా ఇక్కడి ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తూ రాజకీయ బలాన్ని ప్రదర్శిస్తూ ఇతర పక్షాలకు చెందిన వారు పదుల సంఖ్యలో సొంతంగా దుకాణాలను నిర్మించుకున్నారు. వీధి వ్యాపారులకు దక్కాల్సిన స్టాళ్లు ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకున్నా, రాజకీయ బలంతో ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తూ సొంత నిర్మాణాలు జరుపుకుంటున్నా సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే తప్ప.. ఆక్రమణలు తొలగించడం లేదు. ఏదేమైనా వీధివ్యాపారులు గౌరవప్రదంగా తమ వ్యాపారాలు చేసుకునే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన స్టాళ్లు లక్ష్యానికి దూరంగా ప్రైవేట్ వ్యక్తుల జేబులు నింపుతున్నాయి.
వెండింగ్ జోన్లు.. నిరుపయోగం
మాదాపూర్, ఏప్రిల్ 6: నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చే క్రమంలో అప్పటి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హరిచందన వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. వ్యర్థాల నుంచి తయారు చేసిన వాటితో వెండింగ్ జోన్లను ఏర్పాటు చేసి పర్యావరణహితంగా మార్చేందుకు తనదైన శైలిలో ముందడుగు వేశారు. ఈ క్రమంలో మాదాపూర్‌లోని శిల్పారామం ఎదురుగా ఉన్న అండర్ పాస్ బ్రిడ్జి పక్కన దాదాపు 40కి పైగా వెండింగ్ జోన్లను ఏర్పాటు చేయడంతో చిరు వ్యాపారులకు ఎంతో మేలు చేకూరింది.
కానీ దురదృష్టవశాత్తు ఆ స్థలం ఓ వ్రైవేట్ వ్యాపారుస్తుడికి చెందినది కావడంతో కోర్టులో కేసు వేయడంతో వెండింగ్ జోన్ల నిర్వాహణ అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీంతో జీవనోపాధి కోసం చిరు వ్యాపారులు చేసేదేమి లేక నగరంలోని ఆయా ప్రాంతంలోని రోడ్డు పక్కనే వ్యాపారాలు కొనసాగించడం మొదలుపెట్టారు. అప్పట్లో చిరు వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన వెండింగ్ జోన్లు ప్రస్తుతం నిరుపయోగంగా పడి ఉన్నాయి. వెండింగ్ జోన్ స్థలంపై ఉన్న వివాదాన్ని పరిష్కరించి అందుబాటులోకి తీసుకురావాలని చిరువ్యాపారులు కోరుతున్నారు.
ఫుట్‌పాత్‌లపై బల్దియా ఫుడ్ స్ట్రీట్లు!
మెహిదీపట్నం ఏప్రిల్ 6: నాంపల్లి నియోజకవర్గం విజయ్‌నగర్ కాలనీ డివిజన్లోని శాంతినగర్‌లో ఫుడ్ స్ట్రీట్ వ్యాపారాలు రాత్రి వేళల్లో నిరాటంకంగా కొనసాగుతున్నాయి. నాలుగేండ్ల కిందట మల్లేపల్లి ఐటీఐ సమీపంలో విశాలంగా ఉన్న రోడ్డుకు ఇరువైపులా జీహెచ్ఎంసీ అధికారులు ఫుట్‌పాత్‌లపై ఫుడ్ స్ట్రీట్ వ్యాపారానికి అనుమతులు ఇచ్చారు. ఇక్కడ 11 దుకాణాలను ఏర్పాటు చేసి.. టెండర్ల ద్వారా అర్హులకు అప్పగించారు. జీహెచ్ఎంసీ అధికారులు అధికారికంగా అనుమతులు ఇవ్వడంతో ఇక్కడ సాయంత్రం తర్వాత వ్యాపారాలు కొనసాగుతున్నాయి.
ఫుడ్ స్ట్రీట్ వ్యాపారం బాగా నడుస్తున్నందున అధికారులు ఇదే డివిజన్లో ఆసిఫ్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఫుట్‌పాత్‌లపై 7 దుకాణాలను ఏర్పాటు చేశారు. వాటిని అర్హులకు కేటాయించి సంవత్సరం గడుస్తున్నా..ఎవరూ వ్యాపారాలు మొదలు పెట్టలేదు. దీంతో ఇక్కడ ఫుట్‌పాత్‌లపై డబ్బాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నగరంలో అధికారులు ఫుట్‌పాత్ వ్యాపారాలను తొలగిస్తుండగా, ఇక్కడ మాత్రం అధికారికంగా ఫుడ్స్ట్రీట్లను పెట్టడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.