Metro Phase-2 | సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ) : డీపీఆర్ త్వరగా పూర్తి చేయాలి. ప్రాజెక్టు పనులు శరవేగంగా మొదలు పెట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన బుట్టదాఖలైంది. వీలైనంత త్వరగా మెట్రో ఫేస్-2 పార్ట్ బీ విస్తరణ సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించిన ఇప్పటికీ సంబంధిత శాఖకు చేరలేదు. నార్త్ సిటీ ప్రాంతానికి మెట్రో లైను విస్తరిస్తామని స్వయంగా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి 126 రోజులు గడిచినా.. కార్యరూపంలోకి రాలేదు.
మూడు నెలలో డీపీఆర్ పూర్తి చేయాలని ఆదేశిస్తే… తుది మెరుగుల పేరిట రోజులు గడుస్తున్నాయే తప్పా… కంటికి కనిపించలేదు. ప్రాజెక్టు నిర్మాణం దేవుడెరుగు, కనీసం డీపీఆర్ అయితే సిద్ధం చేయకపోవడం ఆ ప్రాంత వాసులను కలవరపెడుతున్నది. ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా, ఇంకా తుది దశలో ఉందనే హెచ్ఏఎంఎల్ ప్రకటించడం తమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడమేనని వాపోతున్నారు.
నార్త్ సిటీ మెట్రో నిర్మాణంపై కొంతకాలంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో డీపీఆర్ తయారీకి రోజులు గడుస్తున్నాయే తప్ప.. ఫలితం లేదు. ఓవైపు ఎలివేటెడ్ కారిడార్, మెట్రో మార్గాలను వేర్వేరుగా నిర్మించాలనే ప్రతిపాదనలు తెరమీదకు రావడం, ఇప్పటికీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు భూసేకరణ పూర్తి కాకపోవడం, ప్యారడైజ్ నుంచి వెళ్లాల్సిన మార్గాన్ని జేబీఎస్‌కు మార్చడం ఇలా నార్త్ సిటీ విషయంలో ఇటీవల జరిగిన అంశాలన్నీ ప్రాజెక్టు మనుగడపై అనుమానాలను పెంచుతున్నాయి.
ఇక ప్రభుత్వం కూడా నార్త్ సిటీ మెట్రోపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో ప్రాజెక్టును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. అయితే హెచ్ఏఎంఎల్ మాత్రం ఈ అంశాన్ని దాటవేసేలా, డీపీఆర్ తుది దశలో ఉందని, పలు మార్పులు, చేర్పులు జరుగుతున్నాయని, త్వరలోనే డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని ప్రకటిస్తుందే తప్ప.. ఇప్పటివరకు ఈ అంశాన్ని తేల్చలేకపోతున్నది.