ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 19: ఉస్మానియా యూనివర్సిటీ లింగిస్టిక్స్ విభాగం మాజీ హెడ్, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ మొహమ్మద్ అన్సారీని పరిపాలన భవనం లోనికి రానివ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన తనను పరిపాలన భవనంలోనికి ఎందుకు రానివ్వడం లేదని ప్రశ్నించారు.
పరిపాలన భవనం అధికారుల ప్రైవేటు ఆస్తి కాదని, ప్రజలదని మొహమ్మద్ అన్సారీ గుర్తు చేశారు. తాను 2023 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేసినప్పటికీ నేటికి పెన్షన్ అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన సమస్యపై రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఆశ్రయించానని, తక్షణమే ఓల్డ్ పెన్షన్స్ స్కీం ప్రకారం తనకు పెన్షన్ అందించాలని కమిషన్ ఆదేశించిందని వివరించారు. అయినా కూడా వర్సిటీ ఉన్నతాధికారులు ప్రభుత్వంతో సంప్రదించాలని కాలయాపన చేస్తున్నారని వాపోయారు. దీనిని ప్రశ్నించినందుకు తనను పరిపాలన భవనం లోపలికి అనుమతించకుండా అవమానిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.