సిటీబ్యూరో, జూన్ 18(నమస్తే తెలంగాణ): నగరానికి చెందిన ఓ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి(75)ని సైబర్ నేరగాళ్లు హనీ ట్రాప్‌చేసి రూ.38.73లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ సంవత్సరం మొదట్లో వృద్ధుడికి ఫేస్బుక్లో ఓ మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అతను యాక్సెప్ట్ చేయగా..ఆ మహిళ అతనితో చాటింగ్ చేసింది. తమ తండ్రి వదిలేశాడని, తల్లి టైలర్ అని పరిచయం చేసుకుంది. తనకు చాటింగ్ చేసేందుకు వైఫై సదుపాయం కల్పించాలని అతనికి కేబుల్ ఆపరేటర్ నంబర్ ఇచ్చింది. వెంటనే అతను.. కేబుల్ ఆపరేటర్ నంబర్‌కు ఫోన్‌చేసి రూ.10వేలు పంపాడు.
ఆ తర్వాత ఆ మహిళ నుంచి ఫేస్బుక్లో ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆ విశ్రాంత ఉద్యోగి .. కేబుల్ ఆపరేటర్‌తో చాటింగ్ చేయగా ఆమె జబ్బు పడిందని చెప్పగా.. రూ.10లక్షలు పంపాడు. ఆ తర్వాత తన క్రెడిట్ కార్డు నుంచి మరో రూ.2.65 లక్షలు పంపించాడు. కొన్నిరోజుల తర్వాత ఆ మహిళ దుబాయ్ వెళ్లిపోయిందని, ఆమె కాంటాక్ట్స్ ఏమీలేవని చెప్పాడు. అయితే.. తన తల్లి, సోదరి మీతోతో మాట్లాడాలనుకుంటున్నారని కేబుల్ ఆపరేటర్ చెప్పారు. ఆ తర్వాత వారి ఫేస్బుక్ ఖాతాల నుంచి అతనికి రిక్వెస్ట్ రావడంతో వారితో చాటింగ్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత లైంగిక పరమైన అంశాలపై చాటింగ్ చేసుకున్నారు.
ఈ విషయంపై ఆ అమ్మాయి మైనర్ అంటూ ఇందులో అసభ్యకరంగా చాటింగ్‌చేసి వేధించావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ కేబు ల్ ఆపరేటర్ అతనిని బెదిరించాడు. ఆ తర్వాత ఒకరు వాట్సప్‌లో కాల్చేసి తాను కానిస్టేబుల్‌నని, వారితో వెంటనే సెటిల్ చేసుకోవాలంటూ చెప్పాడు. దీంతో ఆ రిటైర్డ్ ఉద్యోగి.. బాలిక చదువు, ఆమె తల్లి డ్వాక్రా రుణం చెల్లింపు కోసం రూ. 12.5లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ ఈ విషయం ఎస్సైకి తెలిసిందని దీనిపై కేసు కాకుండా ఉండాలంటే డబ్బులు చెల్లించాలంటూ మళ్లీ రూ. లక్షలు తెప్పించుకున్నాడు. ఆ తర్వాత తన కోసం రూ.లక్ష కావాలంటూ అడుగగా పంపించాడు.
మరోసారి ఫోన్ చేసిన కానిస్టేబుల్ కొత్త ఎస్సై వచ్చాడని, అతనికి విషయం తెలిసి పోక్సో కేసు పెడతానంటున్నాడంటూ చెప్పి.. రూ.10లక్షలు కావాలని డిమాండ్ చేయగా రూ.7లక్షలు పంపించాడు. ఇలా ఎస్ఐ, కానిస్టేబుల్ పేర్లతో ఫోన్‌కాల్స్ చేస్తూ, మెసేజ్‌లు పెడుతూ విడతల వారీగా బాధితుడి నుంచి రూ.38.73లక్షలు దోచుకున్నారు. మరోసారి డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు చివరకు సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన ఫేస్బుక్ పరిచయాలు, హనీట్రాప్లను సూచిస్తున్న నేపథ్యంలో రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులు ఎవరి ట్రాప్‌లో పడొద్దంటూ పోలీసులు సూచించారు.