Minister Ponnam | సిటీబ్యూరో, జనవరి 25(నమస్తే తెలంగాణ): విద్యార్థులకు మంచి విద్యా బోధన తప్పకుండా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తాను విద్యార్థి దశ నుంచే రాజకీయాలలోకి వచ్చిన వాన్నని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్యార్థుల అందించే విద్యా బోధన పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆయన అన్నారు. ఆ మేరకు గురువారం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కాలేజీలోని సమావేశ మందిరంలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై స్కూల్ ప్రధానోపాధ్యాయులు, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లతో సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టెన్త్, ఇంటర్ పరీక్షలకు 60 రోజులు సమయం మాత్రమే ఉన్నదన్నారు. టెన్త్, ఇంటర్ ఫలితాలల్లో పిల్లలకు మానసికంగా ఒక లక్ష్యం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే ప్రధానోపాధ్యాయుల నుంచి ఒక అంగీకారం తీసుకుంటున్నామన్నారు.
ఆ అంగీకారాలను కలెక్టర్, డీఈవోకు సమర్పించి, వాటిని నెరవేర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గురుకులాలకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నారు. ప్రస్తుం కలెక్టర్ వద్ద తగిన నిధులు ఉన్నాయని, వాటిని స్కూళ్ల అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. స్కూళ్లలో ప్రత్యేక తరగతులు నిర్వహించే క్రమంలో తాగు నీటితో పాటు స్నాక్స్‌కు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. దాదాపు పదివేల మంది విద్యార్థులకు ఇలాంటి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ, ఇంటర్మీడియట్ అనేది జీవితంలో ఒక జంక్షన్ లాంటిదన్నారు. జిల్లా ఫలితాలలో టాప్ 10లో నిలిచిన వారికి ఆగస్టు 15న సన్మానం చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యాదయ్య, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆశన్న, మైనారిటీ సంక్షేమ అధికారి ఇలియాస్, ఆర్సీవోలు పాల్గొన్నారు.