సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని వ్యాపారస్తులపై ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారుల చర్యల పరంపర కొనసాగుతున్నది. ఈ మేరకు శనివారం ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. మలక్‌పేట గంజ్‌లో జీఎల్ గానుగ నూనె, లిమ్రా వ్యాపారులు, శ్రీ సాయి బాలాజీ ఎంటర్ ప్రైజెస్, ముఖేష్ ట్రేడింగ్ కో కృపా మార్కెట్, యూసుఫ్‌గూడలోని శ్రీ సాయి రామ టిఫిన్స్, రాయులు వారి రుచులు, హాట్ చిప్స్, శ్రీనివాస కిరణాలు, చందానగర్‌లోని రుచిబా రెస్టారెంట్, శ్రీ వెంకటేశ్వర ఎంటర్ ప్రైజెస్, మెహిదీపట్నం కింగ్స్ ఫుడ్ జోన్, అరేబియన్ బైట్స్, చైనీస్ ఫాస్ట్ ఫుడ్, కూకట్పల్లి హాజెల్ నట్‌లో తనిఖీలు చేపట్టారు.
పదార్థాల నమూనాలను సేకరించి ల్యాబ్ పంపారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారస్తులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పటాన్చెరు ఐడీఏ ఆసటి రాజ్‌కుమార్ రోలర్స్ ఫ్లోర్ మిల్లర్స్ ప్రై.లిలో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేల్చారు. గోడలు, పైకప్పులు పాచిగా ఉన్నాయని, ఎలుకలు, పావురాలు, పిచ్చుకల వంటి పక్షుల మలం ఉన్నట్లు గుర్తించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో ఉందని తేల్చిన అధికారులు.. నిర్వాహకుడికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.