బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
బతుకు ఆగమాయే ఉయ్యాలో..
పని దొరకదాయే ఉయ్యాలో.. పూట గడవదాయే ఉయ్యాలో..
కాలనీలల్లో ఉయ్యాలో.. కన్నీళ్లే మిగిలాయి ఉయ్యాలో..
బతుకమ్మ సంబురం ఆ ప్రాంతాల్లో బోసిపోయింది. పండుగ కళ తప్పింది. ఎవరినీ కదిలించినా.. కన్నీటి సమాధానమే. సీఎం రేవంత్ రెడ్డి పాలనతో తమ బతుకులు రోడ్డున పడే దుస్థితి వస్తున్నదని కన్నీటి పర్యంతమవుతున్నారు. పండుగ సందడి లేని ఆ ఇండ్లు ఇప్పుడు కూలబోయే జాబితాలో చేరాయి. ఇప్పటికే 150 ఇండ్లు నేలమట్టమయ్యాయి. పండుగ అనంతరం మూసీ ఇండ్లపై రెడ్ మార్క్ బోర్డులు మళ్లీ వేలాడబోతున్నాయి. అధికారులు వచ్చి మిగిలిన నిర్మాణాల వివరాలు తీసుకుపోయారు. త్వరలో తమ ఇండ్లు కూల్చేయబోతున్నారనే ఆందోళన నిర్వాసితులను వెంటాడుతున్నది.
‘ఈ ఇంట్లో ఇదే చివరి బతుకమ్మనా’..‘ఇలాంటి పరిస్థితుల్లో బతుకమ్మ ఆడాలని లేదు’. అంటూ.. బాధాతప్త హృదయాలతో మహిళలు సమాధానమిస్తున్నారు. మరోవైపు మూసానగర్, శంకర్‌నగర్ నిర్వాసితులను డబుల్ బెడ్రూంలకు తరలించాక.. ఆ ఇండ్లల్లో సరైన వసతులు లేక బతుకమ్మ సంబురాలు చేసుకోవడానికి కూడా మనసు రావడం లేదంటూ.. వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కూలీ పనిపై ఆధారపడే తమ బతుకులకు ఇక్కడ ఉపాధి దొరకడం లేదని.. కుటుంబాన్ని సాకడమే కష్టంగా ఉందని వాపోతున్నారు.
– సిటీబ్యూరో/అంబర్‌పేట/సైదాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ)
బతుకమ్మ సంబురం కనిపించడం లేదని కూలిన తమ ఇండ్లే గుర్తొస్తున్నాయని నిర్వాసితులు బాధపడుతున్నారు. పొయినసారి దసరా ఎంతో సంతోషంగా జరుపుకొన్నామని పేర్కొంటున్నారు. రవళి అనే మహిళ తన బాధ చెబుతూ.. ‘ముప్పై ఎండ్ల కిందట వంద గజాల స్థలంలో మా నాన్న కష్టపడి కట్టిన ఇంట్లో ఇబ్బందులు లేకుండా జీవించాం. మా బతుకులను మూసీ రివర్ డెవలప్మెంట్తో సీఎం రేవంత్ చిన్నాభిన్నం చేశారు. ఇంటికి రెడ్ మార్క్ గుర్తు పెట్టి ఇల్లు ఖాళీ చేయించి, మా కండ్ల ముందే ఇంటిని కూలగొట్టారు. తీరని దుఃఖాన్ని గుండెల్లో దాచుకొని ఇంట్లోని సామాను తీసుకొని ఆటోలో వేసుకొని వస్తుంటే చెప్పరాని బాధ కలిగింది. అధికారులు ఉన్నపళంగా మా ఇండ్లను ఖాళీ చేయించి పిల్లిగుడిసెల డబుల్బెడ్రూం ఇండ్లకు తరలించారు. ఇంతవరకు ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వలేదు.’ అంటూ రోదించింది. ఒక్కొక్కరూ ఒక విధంగా బాధను వ్యక్తం చేస్తున్నారు.
ప్లకార్డులతో ..
మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఏ ఇంటిని చూసినా ‘మా ఇల్లు కూల్చొద్దు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. గతంలో ఆ ఇండ్లు టూలెట్ బోర్డులతో కనిపించేవి. ఇప్పుడు ‘డబుల్ బెడ్రూం వద్దు.. మా ఇల్లు మాకే ముద్దు’, సే నో హోం డిమోలిషన్’, ‘మావి అక్రమ భూములు కావు పట్టా భూములు కష్టపడి కొనుక్కొన్న ఇల్లు మాది’ అంటూ ప్లకార్డులు వెలిశాయి. ఇల్లును కూల్చొద్దంటూ ప్లకార్డులు పట్టుకోవాల్సిన పరిస్థితి రావడం నిజంగా మా దురదృష్టమని నవీన్ అనే వ్యక్తి చెప్పాడు. సీఎం రేవంత్ ఇంత దారుణంగా పేదలపై పగ సాధిస్తారని అనుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
బతుకమ్మ ఆడుకోబుద్ధి కావడం లేదు
బతుకమ్మ అంటే ఎంతో సంతోషం మధ్య ఆడుకునేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఏండ్లుగా ఉంటున్న ఇల్లును మా కండ్ల ముందే కూల్చేస్తారంట. సరిగ్గా నిద్దుర కూడా పోలేకపోతున్నాం. మా ఇండ్లు కూల్చితే ఈ ఏడాది మా ఇంట్లో ఇదే చివరి బతుకమ్మనా అనే బాధ మాకు నిద్దురపట్టనివ్వడం లేదు. సీఎం రేవంత్ పండుగ రోజు కూడా సంతోషంగా లేకుండా కూల్చివేస్తానంటూ బెదిరిస్తున్నారు. ఇలాంటి సీఎంను నేనెప్పుడూ చూడలేదు.
– ధనలక్ష్మి, న్యూ కమలానగర్
పూట గడవడం కష్టంగా ఉంది..
ముగ్గురు కుమార్తెలు, కుమారుడితో కలిసి ఇంట్లో ఉంటున్నాం. భర్త మహ్మద్ గౌస్ ఖురేషీ అనార్యోగంతో ఇంటికే పరిమితమయ్యారు. కూలీ పనికి వెళ్లితేనే పూట గడుస్తుంది. శంకర్‌నగర్‌లో రోజూ కూలీ పని దొరికేది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని ఆగం చేసింది. శంకర్‌నగర్‌లో ఇల్లును కూల్చివేయటంతో ఇక్కడ డబుల్బెడ్రూం ఇంటిని కేటాయించారు. ఇక్కడ కనీస వసతులు లేకపోవడంతోపాటు కూలీ పని దొరకటం లేదు.
– ఖహిమా బీ (శంకర్‌నగర్)