దుండిగల్, సెప్టెంబర్ 15 : దుండిగల్ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ భౌరంపేట్ ఇందిరమ్మకాలనీ వాసులు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరమ్మకాలనీ సమీపంలో బతుకుదెరువు కోసం తాము ఏర్పాటు చేసుకున్న చిన్న,చిన్న డబ్బాలను ఇటీవల కూల్చిన అధికారులు మరికొందరికి మాత్రం కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. తమకు ఎటువంటి రాజకీయ,ఆర్థిక అండదండలు లేనందునే అధికారులు ఎవరో చెప్పిన మాటలు విని ఏకపక్షంగా కూల్చివేసి తమ బతుకులను రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాలనీకి చెందిన అరుణ సర్కిల్ కార్యాలయంలో మహిళా సంఘాల రిసోర్స్‌పర్సన్‌గా పనిచేస్తుందని ఆమె తమపై పగబట్టి అధికారులను తప్పుదోవ పట్టించి డబ్బాలను కూల్చివేయించిందని ఆరోపించారు. కుటుంబపోషణకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తలా లక్ష వెచ్చించి డబ్బాలు ఏర్పాటు చేసుకుంటే అధికారులు కూల్చివేయడంతో వీధిన పడ్డామన్నారు. అరుణ మాత్రం తన ఇంటి సమీపంలో నాలుగు డబ్బాలు ఏర్పాటు చేసుకుని కిరాయిలకు ఇచ్చుకుందని పేర్కొన్నారు.