Hyderabad | సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ) :భారీ వర్షాలు కురుస్తుండటంతో బల్దియా అప్రమత్తమైంది. సహాయక చర్యలు ముమ్మరం చేసింది. సమస్యలపై తక్షణం స్పందిస్తున్నది. బల్దియాకు 300 ఫిర్యాదులు రాగా, 280 పరిష్కరించింది. కలెక్టరేట్లోనూ ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. వానల నేపథ్యంలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో బల్దియా టోల్ ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పర్యటించి బాధితుల్లో భరోసా కల్పించారు. వరదలతో నీట మునిగిన మల్లంపేటలోని బీహార్స్లమ్ బస్తీ నుంచి 50 కుటుంబాలను రెస్యూ టీమ్ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కలుషిత నీరు, సివరేజి సమస్యలపై వెంటనే స్పందించాలని, నీటి నాణ్యత పరీక్షలు రెట్టింపు చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. భారీ వరద కారణంగా హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తి మూసీలోకి 700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. రాగల మరో మూడు రోజులు భారీ వర్షా లు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం టోలిచౌకిలో 4.5, గాజులరామారంలో 2.7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ రోనాల్డ్‌రోస్, ఇతర జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి మంత్రి తలసాని టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలతో హుస్సేన్‌సాగర్‌కు ఎగువ నుంచి పెద్ద ఎత్తున నీరు వస్తుందని, నీటి లెవల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి తలసాని సూచించారు. దిగువకు నీటి విడుదల జరుగుతున్నందున లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వివిధ రకాల సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ అవసరమైన సేవలు అందించాలన్నారు. మరో 2, 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, జోనల్ కమిషనర్లు, అన్ని స్థాయిలలోని అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అధిగమించే విధంగా జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు కూడా అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలని సూచించారు.
ముంపు ప్రాంతాల్లో కమిషనర్ పర్యటన
వర్షాల కారణంగా క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రోస్ అధికారులకు సూచించారు. హిమాయత్లోని ఆదర్శ్ బస్తీలో ముంపునకు గురైన ప్రాంతాల్లోన్ని, నల్లకుంట, పద్మనగర్, నాగమయ్య కుంట, ఆడిక్‌మెట్ ప్రాంతాల్లో కమిషనర్ రోనాల్డ్ రోస్, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ పర్యటించి లోతట్లు ప్రాంత ప్రజలకు భరోసా కల్పించారు. ముందుగా హిమాయత్‌నగర్ స్ట్రీట్ నం.14 లోతట్టు ప్రాంతంలో నాలా ఉప్పొంగడంతో స్థానిక ఇండ్లలోకి నీరు ముంచెత్తింది. దీంతో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలతో పాటు డీఆర్ఎఫ్ టీంలు మోటార్లు పెట్టి నీటిని బయటకు పంపించి ప్రజలకు ముంపు నుంచి విముక్తి కల్పించారు. నాలా పొంగడానికి గల కారణాలను కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆరా తీశారు. హుస్సేన్‌నగర్ నాలాలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున నాలా పొంగినట్లు అధికారులు వివరించారు. ఆదర్శ్ బస్తీలో నాలా రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులను రాబోయే రోజుల్లో చేపట్టి వరద నీరు రాకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు.
ఎప్పటికప్పుడు మంత్రి కేటీఆర్ సమీక్ష
జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలపై మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేస్తున్నారని కమిషనర్ రోనాల్డ్ రోస్ చెప్పారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా 24 గంటల పాటు 428 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు పనిచేస్తున్నాయని, అంతేకాకుండా 27 డీఆర్ఎఫ్ బృందాలు కూడా పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూం ద్వారా ఏర్పాటు చేసి తద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో అప్రమత్తం చేసినట్లు వివరించారు. అనంతరం నల్లకుంట, పద్మనగర్‌లో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ ఎస్ఎన్డీపీ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, జోనల్ కమిషనర్ రవికిరణ్, సీఈ సురేశ్ కుమార్, ఎస్ఈ అనిల్‌రాజ్, డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, తదిరతులు పాల్గొన్నారు.
కంట్రోల్‌రూంలో ఫిర్యాదులను పరిష్కరించిన డిప్యూటీ మేయర్
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నదని, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉన్న చోట డీఆర్ఎఫ్టీంలు, మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు పనిచేస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందవద్దని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం డిప్యూటీ మేయర్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూంను పరిశీలించారు. నగర ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది తలెత్తితే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం 040-2111 1111 నంబర్‌కు గానీ డయల్ 100, మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా తెలియజేయాలన్నారు. నగరవాసుల నుంచి వస్తున్న ఫిర్యాదులను జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం నుంచి డిప్యూటీ మేయర్ పర్యవేక్షించారు. కంట్రోల్ రూంకు వీధి దీపాలు, టౌన్‌ప్లానింగ్, శానిటేషన్, వాటర్‌వర్క్స్, విరిగిపోయిన చెట్ల గురించి ఎక్కువగా ఫిర్యాదు వచ్చాయి. సమస్యలను స్వీకరించి, సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కారం చూపుతున్నామని ఓఎస్డీ అనురాధ ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్‌కు వివరించారు.