రవీంద్రభారతి, ఏప్రిల్ 28: సంప్రదాయ బద్ధంగా అనాదిగా గీత కార్మికులు తమ వృత్తిని కొనసాగిస్తూ నిరంతరం ప్రమాదాలతో వందిలాది మంది మృత్యువాత పడుతున్న గీత కార్మికుల మరణాలను నివారించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌లకు అఖిలభారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేములయ్యగౌడ్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం శుక్రవారం వినతి ప్రతాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు రవీంద్రభారతిలో విలేకరులతో మాట్లాడుతూ.. గీత కార్మికులకు తాటి చెట్టు ఎక్కే యంత్రాలు సేఫ్టీ మోకులను అందించాలని విజ్ఞప్తి చేశారు. గత 15 నెలలుగా సుమారు 750 పైగా గీతా కార్మికులు గీత వృత్తిలో భాగంగా ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి పడి శాశ్వత అంగవైకల్యం, మరణాలు సంభవించిన గీత కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎక్స్‌గ్రేషియా రూల్స్‌ను వైద్యశాఖ అందించే నివేదికను సరళతరం చేసి గీత కార్మికుల కుటుంబాలను అండగా నిలవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ వివిధ వృత్తులకు సహకారం అందించే మాదిరిగానే గీత కార్మికులకు నూతన సహకార సంఘాల సభ్యత్వం కల్పించి వారి సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది గీతవృత్తిదారులు ఉన్నా వారిలో కొంత మందికి మాత్రమే గీత పారిశ్రామిక సహకార సంఘాల్లో సభ్యత్వం గతంలో ఉందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గీత కార్మికుల కోసం నూతన గీత పారిశ్రామిక సంఘాలను ఏర్పాటు చేసి వాటిలో కొత్తవారికి సభ్యత్వం కల్పించాలన్నారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, వి. శ్రీనివాస్‌గౌడ్ వినతి పత్రంపై సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిద్దెల మల్లేశంగౌడ్, ఆనంద్‌గౌడ్, బాలరాజు, గిరిగౌడ్ నలినిగౌడ్, అనిల్‌గౌడ్, కృష్ణగౌడ్, యాదయ్యగౌడ్ పాల్గొన్నారు.