మియాపూర్, ఫిబ్రవరి 12: హైదరాబాద్‌లో రహదారులపై ఆక్రమణల (Encroachments) తొలగింపు ముమ్మరంగా సాగుతున్నది. ఆపరేషన్ రోప్లో భాగంగా ఫుట్‌పాత్‌లపై, రహదారులకు ఇరువైపుల వెలసిన దుకాణాలు, తోపుడు బండ్లను అధికారులు తొలగిస్తున్నారు. ఇందులో భాగంగా చందానగర్ సర్కిల్ పరిధిలోని జాతీయ రహదారికి ఇరువైపుల ఆక్రమణలను పోలీసులు తొలగించారు. మరో వారం రోజులపాటు ఆక్రమణ తొలగింపుపై స్పెషల్ డ్రైవ్ కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రణాళిక విభాగం ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసు విభాగాల బందోబస్తుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
లింగంపల్లి చౌరస్తాలో నిర్మించిన ఫ్లైఓవర్ త్వరలో ప్రారంభోత్సవం కానున్న నేపథ్యంలో రహదారి ఆక్రమణ తొలగింపును అధికారులు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఈ ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేయనున్నారు. సర్కిల్ పరిధిలోని మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి లింగంపల్లి చౌరస్తా వరకు ఆక్రమణల తొలగింపు వారం రోజులపాటు కొనసాగించనున్నట్లు చందానగర్ సర్కిల్ ఉప కమిషనర్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.