సిటీబ్యూరో: మియాపూర్ బస్సు బాడీ ఎదుట సర్వే నంబర్ 20,21ల్లో విలువైన హెచ్ఎండీఏకు సుమారు 2500 చదరపు స్థలం ఉంది. ఇందులో గుడిసెలను వేయించి, చిన్నపాటి వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ స్థలం మియాపూర్-బొల్లారం రహదారిని అనుసరించి ఉండటంతో నెలకు భారీగానే కిరాయిలు కూడా వస్తున్నాయి. కిందిస్థాయి సెక్యూరిటీ సిబ్బంది ఒకరు ఈ తతంగాన్ని నడిపించడంతోపాటు సదరు విలువైన భూమిని ఓ మహిళ ద్వారా జీవో 59 కింద క్రమబద్ధీకరించుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ఈ కబ్జా స్కెచ్‌ను ‘హెచ్ఎండీఏ భూమికి ఎసరు’ శీర్షికతో వెలుగులోకి తెచ్చింది. కథనంపై స్పందించిన అధికారులు సోమవారం గుడిసెలను కూల్చివేశారు.
హెచ్ఎండీఏ డిప్యూటీ ఈవో దివ్య రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల సహకారంతో 15కుపైగా గుడిసెలను పూర్తిగా తొలగించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ భూమిని కాజేసేందుకు ప్రయత్నించిన కిందిస్థాయి సెక్యూరిటీ పై అంతర్గత విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. సదరు సెక్యూరిటీ గార్డ్ ప్రైవేట్‌గా వాహనం ఏర్పాటు చేసుకొని నిత్యం భూమిపై పర్యవేక్షణ చేపట్టి అక్రమార్కులకు అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.