బంజారాహిల్స్, జూలై 23: ఆలయ ప్రాంగణంలోకి అసాంఘికశక్తులు ప్రవేశిస్తూ న్యూసెన్స్ చేస్తున్నాయనే సాకుతో ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన గేటుతోపాటు కొత్తగా వెలసిన ఆక్రమణలను షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది కూల్చేశారు. వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట మండలం ఫిలింనగర్‌లోని దీన్దయాళ్నగర్ను ఆనుకుని సుమారు రెండెకరాల ఖాళీ ప్రభుత్వ స్థలం ఉన్నది. దీన్ని గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం ప్రతిపాదించారు.
అయితే ఫీజబులిటీ లేదంటూ జీహెచ్ఎంసీ హౌసింగ్ విభాగం తేల్చడంతో స్థలాన్ని రెవెన్యూ శాఖ వెనక్కి తీసుకున్నది. కాగా, ఈ స్థలంలో నుంచి పర్వతాంజనేయ స్వామి ఆలయానికి రోడ్డు వేయాలని స్థానికులు కోరడంతో రెండేళ్ల కిందట రోడ్డును వేశారు. కాగా, ఆలయం ఆవరణలోకి అసాంఘికశక్తులు వస్తున్నాయంటూ కొన్నిరోజులుగా స్థానిక నేతలు గేటు ఏర్పాటుకు యత్నించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసుకోవాల్సిన గేటును ఏకంగా 150మీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు.
అయితే గేటుకు కుడివైపున ఉన్న సుమారు 400 గజాల స్థలాన్ని కొంతమంది ఆక్రమించేందుకు ఈ గేటు ఏర్పాటు చేశారంటూ స్థానికులు ఫిర్యాదులు చేశారు. ఈ వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో రెండ్రోజుల కిందట ‘కబ్జాలు చేయమంటూనే.. ఆక్రమణలు’ అనే శీర్షికతో కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో విచారణ చేపట్టిన అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి కబ్జాలకు యత్నించింది నిజమే అని తేల్చారు.
ఓ స్కూల్ నిర్వాహకులు రోడ్డు కోసం ప్రయత్నిస్తుండటంతోపాటు కొన్ని ఇండ్ల ఎదురుగా దర్జాగా కబ్జాలు చేసి కూరగాయలు,పూల మొక్కలు పెట్టుకుని ఫెన్సింగ్ వేసినట్లు గుర్తించారు. దీంతో పాటు బస్తీకి చెందిన ఓ నేత ఇటీవల గదిని నిర్మించినట్లు తేలింది. బుధవారం షేక్‌పేట రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వ స్థలంలో నిర్మించిన గేటును కూల్చేశారు. వినాయక్‌నగర్ వైపు ఉండాల్సిన గేట్లను దీన్‌దయాళ్‌నగర్ వైపుకు పెట్టడం కుదరని, ఇక్కడి వైపు నుంచి ప్రభుత్వ స్థలంలో రాకపోకలకు వీల్లేదని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ స్థలంలో ఎలాంటి ఆక్రమణలు చేసినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కాగా, అక్రమంగా వెలిసిన గదిని కూల్చలేదని, ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడితో గదిని వదిలిపెట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు.