సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో గ్రేట ర్లో ఆక్రమణల తొలగింపు జరుగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం మూసాపేట ఆంజనేయనగర్‌లో పార్కు స్థలంలో అక్రమంగా ఉన్న కమర్షియల్ నిర్మాణాలను తీసేసిన హైడ్రా.. ఆ తర్వాత చాదర్‌ఘాట్ వద్ద మూసీ గర్భంలో ఉన్న షెడ్లను తొలగించింది. వేలాదిమంది సంచరించే చాదర్‌ఘాట్ బ్రిడ్జి నుంచి పాతబస్తీ ఉస్మానియా వరకు మూసీగర్భం లో కబ్జాలున్నట్లుగా హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేయగా.. ఆ ఆక్రమణలను తొలగించింది.
వాహనాల పార్కింగ్, పండ్లు నిల్వ ఉంచే ఫ్రీజర్ల ఏర్పాటుతో పాటు నర్సరీ నిర్వహిస్తున్న చోట చర్యలు తీసుకున్నది. ఇక్కడ కబ్జాలపై హైకోర్టు గతంలోనే సీరియస్ కాగా.. కోర్టు ఉత్తర్వుల మేరకు హైదరాబాద్ కలెక్టర్ ఆక్రమణదారులపై కేసులు కూడా పెట్టారని హైడ్రా పేర్కొంది. అక్కడ కబ్జాలు చేసి వ్యాపారాలు చేయడంతో పాటు ఆఫీసుల కోసం చిన్నచిన్న షెడ్లు వేశారని, నదీగర్భంలో పార్కింగ్ పేరిట అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించిన హైడ్రా ఆ ఆక్రమణలను కూల్చేసి.. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు హైడ్రా అధికారులు తెలిపారు.
మూసీ సుందరీకరణతో సంబంధం లేదు..
మూసీసుందరీకరణ పనులతో హైడ్రాకు సంబంధం లేదని, నదిలో ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలను తొలగించడం వరకే హైడ్రా పరిమితమైందని హైడ్రా ఒక ప్రకటనలో తెలిపింది. మూసీని మట్టితో నింపి వ్యాపారానికి అడ్డాగా మార్చుకున్నారని వారిపైనే చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. మూసీ సుందరీకరణ, అభివృద్ధిలో హైడ్రా భాగస్వామ్యం కావడం లేదని, ఓఆర్ఆర్ పరిధిలో కబ్జాలను తొలగించిన మాదిరే మూసీ నదిలో ఆక్రమణలను తొలగించామని హైడ్రా స్పష్టం చేసింది.