సిటీబ్యూరో, డిసెంబరు 30 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో ఏఎంఓహెచ్ (అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్) బాధ్యతల్లో కోత విధిస్తూ కమిషనర్ తీసుకున్న నిర్ణయం పై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇకపై శానిటేషన్ విధుల్లో జోక్యం చేసుకోవద్దని, కేవలం వైద్య ఆరోగ్య సంబంధిత విధులకు మాత్రమే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేశారు. పాలనాపరమైన ప్రక్షాళన పేరిట 21 మంది ఏఎంఓహెచ్లను బదిలీ చేస్తూ, వారి విధుల్లో కోత విధిస్తూ కమిషనర్ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇకపై శానిటేషన్ విభాగం (ఎస్డబ్ల్యూం)లో పారిశుధ్య పనులను పర్యవేక్షించేందుకుగాను డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల (డీఈఈ)లకు బాధ్యతలు కొత్తగా అప్పగించారు. నూతన పరిపాలన నిర్మాణం ప్రకారం వైద్యాధికారులు పారిశుధ్య విధుల నుంచి తప్పుకోవాలని, ఆ విభాగాన్ని పూర్తిగా ఇంజినీరింగ్ అదికారులే చూసుకుంటారని సంబంధిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని కమిషనర్ స్పష్టం చేశారు. సంబంధిత వైద్యాధికారుల ఆరోగ్య బాధ్యతలపైనే దృష్టి సారించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తున్న అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (ఏఎంఓహెచ్) బాధ్యతలను కమిషనర్ గణనీయంగా తగ్గించారు. ఇక మీదట తమ పరిధిలోని ఇమ్యునైజేషన్ ఆఫీసర్లుగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంటు వ్యాధులు, వ్యాధుల వ్యాప్తిపై నిరంతర పర్యవేక్షించాల్సి ఉంటుంది. డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, రేబిస్ (పిచ్చికుక్క కాటు) నియంత్రణకు నోడల్ ఆఫీసర్లుగా పనిచేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పర్యవేక్షణలో భాగంగా తమ పరిధిలోని యూపీహెచ్సీలు , సీహెచ్సీల్లో మెడికల్ ఆఫీసర్లకు, సిబ్బందికి సహకారం అందించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇందిరమ్మ క్యాంటీన్ల పర్యవేక్షణలో భాగంగా రూ.5ల సబ్సిడీ అల్పాహార, భోజన పథకానికి సంబంధించి ఆహారం నాణ్యతగా, సకాలంలో పంపిణీ అయ్యేలా చూడాల్సి ఉంటుంది.
సాధారణంగా జనన, మరణాల నమోదు, ధ్రువీకరణ పత్రాల జారీ అనేది పూర్తిగా వైద్య సంబంధిత అంశం కావడంతో దశాబ్దాలుగా అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (ఏఎంఓహెచ్) ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ అంశంపై సదరు ఉత్తర్వుల్లో స్పష్టం చేయకపోవడం పై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. జనన, మరణాల నమోదులో వైద్యపరమైన అంశాలు, కారణాలు కీలకమని, సాంకేతిక రంగంలో ఉండే ఇంజినీర్లకు ఈ బాధ్యతలు అప్పగించాలని భావిస్తుండడం ఏంటని వైద్యాధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పనుల భారంతో ఉన్న తమపై నుంచి ఈ బాధ్యత తీసేయడం ఊరట కలిగించిన అది వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందని అంటున్నారు. ముఖ్యంగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాల పరిశీలన వైద్యాధికారులకే సాధ్యమని, వేరే వారి చేతుల్లో పెడితే అవినీతి, అక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే పాలనాపరమైన సంస్కరణల్లో భాగంగా విధుల్లో జాప్యాన్ని తగ్గించేందుకు కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నారు.