సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ఖజానా నింపేందుకు అధికారులు వేగం పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ముగియడానికి మరో రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో, నిర్దేశించుకున్న రూ. 3000 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యేక కసరత్తు చేస్తున్నది. ఇప్పటివరకు రూ. 1,922 కోట్ల మేర ఆస్తి పన్ను వసూలు కాగా, మిగిలిన రూ. 1,088 కోట్లను ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే రాబట్టాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
వచ్చే సోమవారం నుంచి కలెక్షన్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి జరిగిన వసూళ్లతో పోలిస్తే, ఈసారి రూ. 205 కోట్లు అధికంగా వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. వచ్చే ఫిబ్రవరిలో రూ. 500 కోట్లు, మార్చిలో మరో రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసేలా లక్ష్యాన్ని చేరుకోవాలన్న అంచనాతో అధికారులు ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టి సారించారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని 60 సర్కిళ్లలో భారీగా బకాయి ఉన్న ఆస్తి యజమానులకు త్వరలోనే రెడ్ నోటీసులు జారీ చేయనున్నారు. దీంతో పాటు పెండింగ్లో ఉన్న పాత బకాయిల పరిషారం కోసం వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్)ను ఇప్పటికే అమలులోకి తీసుకువచ్చిన అధికారులు ప్రసార మాధ్యమాలు, హోర్డింగ్లు, ఎఫ్ ఎం రేడియోల ద్వారా అవగాహన కల్పించనున్నారు.
దీంతో పాటు విలీన మైన పురపాలికల్లో వార్డు అధికారులకే పన్ను వసూలు బాధ్యతలు అప్పగించారు. 27 పురపాలికల విలీనం తర్వాత జీహెచ్ ఎంసీ పరిధిలో డాకెట్ల సంఖ్య అదనంగా 254 పెరిగిందని అధికారులు చెప్పారు. ఈ 254 డాకెట్లకుగాను 254 మంది వార్డు ఆఫీసర్లను ఇన్చార్జ్ బిల్ కలెక్టర్లుగా నియమించారు. వీరందరికి అత్యాధునిక హ్యాండ్ హెల్డ్ మిషన్లను పంపిణీ చేసే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఇప్పటికే కీసర, హయత్ నగర్ సరిళ్ల సిబ్బందికి మిషన్లను అందజేశారు.
ఆస్తి పన్నుకు సంబంధించి ఏళ్ల తరబడి కోర్టుల్లో లేదా అధికారుల వద్ద నలుగుతున్న వివాదాలను పరిషరించేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల లోపు ఉన్న వివాదాలను పరిషరించే అధికారం డిప్యూటీ కమిషనర్లకు, అంతకంటే ఎకువ కాలం పెండింగ్లో ఉన్న వాటిని పరిషరించే పవర్ జోనల్ కమిషనర్లకు అప్పగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే వారం నుంచి ప్రతి సరిల్ కార్యాలయంలో ప్రత్యేక అదాలత్ లేదా పరిషార వేదికలను నిర్వహించనున్నట్లు అధికారులు వివరించారు.