ఎడతెరిపి లేని వర్షాలతో నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. కూకట్పల్లి, అల్లాపూర్ ప్రాంతాల్లో 20 ఇండ్లు నీటి మునిగాయి. వానకు తోడు బలంగా వీచిన గాలులతో గ్రేటర్ వ్యాప్తంగా 115 చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఇందులో 105 ప్రాంతాల్లో పరిష్కారం చూపామని, మిగిలిన 10 ప్రాంతాల్లో ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉన్నదని అధికారులు పేర్కొన్నారు. కాగా, 24 చోట్ల రహదారులపై నీరు నిలిచిపోవడంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక వివిధ సమస్యలపై జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు దాదాపు 150కి పైగా ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.
24 ప్రాంతాల్లో నిలిచిన నీరు
బీహెచ్ఈఎల్ క్రాస్‌రోడ్, లింగంపల్లి రైల్వే స్టేషన్, శిల్పారామం, విప్రో, ప్రశాంత్‌నగర్, ఐడీపీఎల్ చింతల్, తుకారాంగేట్, మలక్‌పేట, బయోడైవర్సిటీ, జగద్గిరిగుట్ట, బంజారాహిల్స్, జేఎన్టీయూ, ఏఎస్‌రావునగర్, తార్నాక, సుచిత్ర, చంపాపేట, మల్లాపూర్, హస్తినాపురం తదితర ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
విస్తారంగా వర్షాలు
శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు బీహెచ్ఈఎల్లో అత్యధికంగా 8.53 సెం.మీలు, గచ్చిబౌలిలో 8.13, కేపీహెచ్బీలో 7.83, హైదర్‌నగర్‌లో 7.78, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 7.65, గాజులరామారం, మహదేవపురంలో 7.60, యూసుఫ్‌గూడలో 7.48, సరూర్‌నగర్‌లో 7.15 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మలక్‌పేటలో అత్యధికంగా 4.68 సెం.మీలు, అత్యల్పంగా రాజేంద్రనగర్‌లో 3.18 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.