బంజారాహిల్స్/ఖైరతాబాద్,జూలై 27: ఖైరతాబాద్ నియోజకవవర్గంలో వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం రాత్రి ప్రారంభమైన వర్షం గురువారం మొత్తం కొనసాగింది. దీంతో ప్రధాన రహదారులతో పాటు బస్తీలు, కాలనీల్లోని ఇళ్లలో వరదనీరు చేరింది.
ఖైరతాబాద్ డివిజన్లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్, బీఎస్ మక్తా, హరిగేట్, ఎంఎస్ మక్తాలు లోతట్టు ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక్కడ వర్షా కాలంలో పెద్ద ఎత్తున వరద నీరు నిల్వ ఉంటుందని, గత సంవత్సరం విజయవంతంగా నీటిని క్రమబద్ధీకరించిన అధికారులు ఈ ఏడాది అలాంటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. టిప్పర్లలో సిబ్బందితో పాటు మోటార్లను అక్కడికి తరించారు. ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్‌కు చెందిన వరద నీటిని మింట్ కాంపౌండ్‌లో మోటార్ల సాయంతో తోడివేస్తున్నారు. అలాగే బీఎస్‌మక్తా నీటిని ఎస్టీపీలోకి, ఎంఎస్‌మక్తాలో వరదనీటిని నెక్లెస్‌రోడ్‌లోకి వదులుతున్నారు. బల్దియా ఇంజినీరింగ్ విభాగం పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయని డీఈ చైతన్య తెలిపారు.