Keesara | మేడ్చల్, జూన్ 16(నమస్తే తెలంగాణ): కాస్తులో ఉండగానే రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లు తారుమారయ్యాయని, 94 ఎకరాల భూమిని రాగి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఫోర్జరీ సంతకాలతో రికార్డుల్లో నమోదు చేసుకొని దాదాపు రూ.500 కోట్లకు పైగా భూ కుంభకోణానికి పాల్పడ్డారని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసరలోని బాధిత దళితులు ఆరోపిస్తున్నారు. 2004 నుంచి రికార్డుల్లో ఉన్న తమ పేర్లు మారిపోవడంతో 2006 నుంచి భూమి కోసం పోరాడుతున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి.హన్మంతరావు మాట్లాడుతూ ‘దళితుల భూమి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయడం లేదు’ అని బహిరంగంగా ఆరోపించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కీసరలో 1981లో కౌలులో ఉన్న సర్వే నంబర్లు 179, 213, 174, 175, 176, 173లో 94.02 ఎకరాలను అప్పటి పట్టాదారైన రాగి కృష్ణారెడ్డి 10 మంది దళితులు పుండ్రు సాయన్న, కుంతల బాలయ్య, కుంతల పోచయ్య, నర్సయ్య, పుండ్రు నర్సయ్య, సాయన్న, మెరుగు సాయన్న, కుంతల బాలయ్య, తుడుం పోచయ్య, తుడుం ఆగయ్యకు 38-ఈ కింద ఇచ్చాడు. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో కీసరలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో జీవో నం.1717 ద్వారా పుండ్రు నర్సయ్య, మెరుగు సాయన్న, శీలం సాయన్న, తుడుం ఆగయ్య, కుంతల బాలయ్యకు చెందిన భూమిని కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఫోర్జరీ సంతకాలతో 2004లో తమ పేరిట నమోదు చేసుకున్నారని, ఆ భూమిని ఇతరులకు విక్రయించి భూ కుంభకోణానికి పాల్పడ్డారని కౌలు రైతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆ భూముల్లో హెచ్ఎండీఏ అనుమతుల మేరకు ఇండ్ల నిర్మాణాలు (విల్లా ప్రాజెక్ట్) కొనసాగుతున్నాయి.
కీసరలో దళితల భూమి విషయం కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి వచ్చినా స్పందించడం లేదని, భూమి వారసులైన 120 మంది దళితులకు న్యాయం జరగక రోడ్డుపై పడ్డారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హన్మంతరావు తాజాగా సొంత ప్రభుత్వంపైనే ఆరోపణలు చేశారు. ‘ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇదేనా? దళితులకు పది రోజుల్లో న్యాయం జరగకుంటే ఆమరణ దీక్షకు దీగుతా’ అని ఆయన చెప్పిన మాటలు మేడ్చల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. కాగా ఈ భూముల లే అవుట్‌కు 2010లోనే అనుమతులు వచ్చినట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. లే అవుట్ అనుమతులు ఉన్నందునే ఇంటి నిర్మాణాలు కొనసాగుతున్నట్టు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి ఈ భూమిపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని చెబుతున్నారు.