GHMC | బల్దియాలో డిప్యూటేషన్లకు ఎర్రతివాచీ.. ఖజానాకు గుదిబండగా మారుతున్న డిప్యూటీ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు
ఒకవైపు ఉద్యోగులకు నెలవారీగా వేతనాలు సకాలంలో అందని పరిస్థితి...పైగా నిధుల్లేక లేక అభివృద్ధి పనులు పట్టాలెక్కడం లేదు. పురోగతి పనులకు అతీగతి లేదు. కాంట్రాక్టర్లు సైతం బకాయి బిల్లులు చెల్లిస్తేనే పనులు చేపడతామంటూ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు.
GHMC | సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ఒకవైపు ఉద్యోగులకు నెలవారీగా వేతనాలు సకాలంలో అందని పరిస్థితి…పైగా నిధుల్లేక లేక అభివృద్ధి పనులు పట్టాలెక్కడం లేదు. పురోగతి పనులకు అతీగతి లేదు. కాంట్రాక్టర్లు సైతం బకాయి బిల్లులు చెల్లిస్తేనే పనులు చేపడతామంటూ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఆశించిన స్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లు లేవు. ఈ పరిస్థితిలో అధికార యంత్రాంగం లోపాలను సరిదిద్దుకుని పొదుపు మంత్రాలతో సంస్థను గట్టెక్కించాల్సి ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఇష్టారీతిన డిప్యూటేషన్లపై వస్తున్న అధికారులతో బల్దియా ఖజానాకు మరింత భారంగా మారుతున్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు దాదాపుగా 15 మంది డిప్యూటేషన్‌పై డిప్యూటీ కలెక్టర్లు జీహెచ్ఎంసీకి వచ్చారు. ఎన్నికలు అయ్యాక ఒకరిద్దరికీ తప్ప.. మిగిలిన వారికి పెద్దగా పని లేదు. కొన్ని రోజులుగా వీరిని ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు ఇచ్చిన యంత్రాంగం..ప్రధాన కార్యాలయంలో సర్దుబాటు చేశారు. అయితే ఇటీవల కాలంలో ఎన్నికల బదిలీల్లో భాగంగా పురపాలక శాఖకు సంబంధించిన దాదాపు 14కి పైగా మున్సిపల్ కమిషనర్లు డిప్యూటేషన్‌పై జీహెచ్ఎంసీకి వచ్చారు. వీరిని సర్దుబాటు చేసే క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా డిప్యూటీ కమిషనర్లుగా ఎస్డబ్ల్యూఎం బాధ్యతలు అప్పగించారు.
ఇష్టారీతిన వస్తున్న డిప్యూటేషన్లతో ఖజానాకు భారమే తప్ప..వారి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఇటీవల కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థలో ఆర్థిక మాంధ్యం ఉన్నప్పుడు అధికారులను తగ్గించాల్సింది పోయి వస్తున్న వారికి ఆహ్వానం పలుకుతున్నారని, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో సహా ఎందరో ఉన్నా రావాల్సిన ఆదాయాన్ని రప్పించలేక, ఆపై అడ్డగోలు అక్రమాలు జరుగుతున్నా వాటిని అడ్డుకట్ట వేయలేకపోతున్నారని నిండు సభలో పార్టీలకు అతీతంగా ముక్తకంఠంతో లోపాలను ఎత్తిచూపారు. కమిషనర్ రోనాల్డ్ రాస్ అప్పటి వరకు కొనసాగిన అదనపు కమిషనర్ (అడ్మిన్) సరోజను బదిలీ వేటు వేశారు. అయితే డిప్యూటీ కలెక్టర్లు విషయంలో మాత్రం నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. కౌన్సిల్ సమావేశం జరిగిన తర్వాతే దాదాపు డజను మందికి పోస్టింగులిచ్చారు. పోనీ ఈ పోస్టింగులైన అధికారుల స్థాయికి తగ్గట్లు బాధ్యతలున్నాయా అంటే అదీలేదు. గతంలో ఒకరు చేసిన పనినే నలుగురైదుగురికీ అప్పగించారు. దీంతో అధికారులు..వారికి అవసరమైన చాంబర్లు, కార్లు, సిబ్బందితో జీహెచ్ఎంసీకి ఖర్చుల భారం మరింత పెరుగుతుందే తప్ప..తగ్గదు. కేవలం తమ అవసరాల కోసం హైదరాబాద్ కు వచ్చేవారికి పునరావాస కేంద్రంగా జీహెచ్ఎంసీ మారుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోవడం లేదు.
అంతా గందరగోళం
గతంలో సంస్థలో వైద్యం, ఆరోగ్యం, పారిశుధ్యం, దోమల నివారణ, కుకల నియంత్రణ తదితరమైనవన్నీ ఒకే అడిషనల్ కమిషనర్ నిర్వహించేవారు. అది సైతం ఐఏఎస్ అధికారి కాదు. సహాయకులుగా ఒక జాయింట్ కమిషనర్ ఉండే వారు. ప్రస్తుతం ఆరోగ్యానికి ఒక అడిషనల్ కమిషనర్, పారిశుధ్యానికి మరో అడిషనల్ కమిషనర్, ఇందులో ఒకరు ఐఏఎస్ ..అడిషనల్ కమిషనర్లకు సహాయకంగా నలుగురైదుగురు జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు. వీరందరికీ కార్లతో సహా సకల సదుపాయాలు జీహెచ్ఎంసీ ఖజానా నుంచే అందుతాయి. ఇటీవల జీహెచ్ఎంసీకి బదిలీపై వచ్చిన ఇద్దరు డిప్యూటీ కమిషనర్లకు రెండు జోన్లలోని పారిశుధ్య పనులు అప్పగించారు. మరో అడిషనల్ కమిషనర్‌కు లీగల్, విద్యుత్ విభాగం బాధ్యతలు అప్పగించారు. ఇంకో స్పెషల్ గ్రేడ్ కమిషనర్‌కు ఎన్నికల విభాగం జాయింట్ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. రెవెన్యూ విభాగం నుంచి వచ్చిన డిప్యూటీ కలెక్టర్‌కు సైతం ఎన్నికల విభాగంలోనే మరో జాయింట్ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఇంకో స్పెషల్ గ్రేడ్ కమిషనర్‌కు ఆరోగ్య విభాగంలో జాయింట్ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకో విభాగంలో ఎంతమందిని నియమిస్తున్నారో అంతే లేదు.
వివాదాస్పద డీసీలకు కీలక పోస్టులు
ఇటీవల డిప్యూటీ కమిషనర్ల బదిలీలు జరిగాయి. ఇందులో ఇద్దరికీ కీలక పోస్టుల్లో బాధ్యతలు అప్పగించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అల్వాల్‌లో పనిచేసిన సమయంలో ఓ డీసీ మహిళపై అసభ్యంగా ప్రవర్తించడం, మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసి.. సదరు డీసీని ప్రాధాన్యత లేని పోస్టులో నియమించాలని ఆదేశించింది. కానీ సదరు డీసీని హయత్‌నగర్ బాధ్యతలు అప్పగించారు. మరో డీసీ అవినీతి ఆరోపణలు ఉండగా, సికింద్రాబాద్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ ఇద్దరి పోస్టుల వెనుక కాంగ్రెస్ పెద్దలు, ప్రొఫెసర్ ఉన్నట్లు చర్చ జరుగుతున్నది.
భారమని తెలిసినా.. ఎందుకీ మౌనం?
జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ప్రతి నెలా వేతనాలు, పెన్షన్లకు రూ. 120-130 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అయితే సంస్థలో అవసరాల మేరకు మాత్రమే డిప్యూటేషన్లకు ప్రోత్సహించాలి. కానీ అలా జరగడం లేదు. హైదరాబాద్‌లో ఉండాలనుకునే ఉద్యోగులంతా పైరవీతో కొందరు..కమిషనర్‌ను సంప్రదించి మరికొందరు వస్తున్నారు. పోనీ వచ్చిన వారితో ఆశించిన స్థాయి ఫలితాలు శూన్యమనే చెప్పాలి. ఎందుకంటే జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయం రావడం లేదు. చెత్త సమస్యలు తగ్గడం లేవు. విద్యుత్ విభాగం నగరంలో చీకట్లను నివారించలేకపోతోంది. ప్రకటనల విభాగం అక్రమాలకు అడ్డాగా మారింది. రెవెన్యూ విభాగం ట్యాక్స్ ల్లోని లోపాలు అరికట్టలేకపోయింది. అంతేకాదు.. ఏ విభాగంలో చూసినా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఇటీవల అభయహస్తం దరఖాస్తులు గాల్లో కొట్టుకు పోవడం అందుకు ఒక నిదర్శనం. అలాగే కార్పొరేటర్లు ఫోన్లు చేసినా.. అధికారులు స్పందించడం లేదు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

