e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home హైదరాబాద్‌ రియల్‌ బూమ్‌ జోర్‌దార్‌

రియల్‌ బూమ్‌ జోర్‌దార్‌

రియల్‌ బూమ్‌ జోర్‌దార్‌
  • ధరల పెరుగుదలలో దేశంలోనే నెంబర్‌వన్‌
  • మిగిలిన మెట్రో నగరాల్లో తిరోగమన పరిస్థితి
  • నగరానికి కలిసొస్తున్న అనేక అనుకూలతలు
  • చక్కటి వాతావరణం, రవాణా, శాంతిభద్రతలు
  • ప్రభుత్వ పాలసీలతో నలుచెరగులా సుస్థిరాభివృద్ధి
  • తాజా నైట్‌ఫ్రాంక్‌ సహా గతంలోనూ అనేక సర్వేల్లో వెల్లడి

ఒక్కో నగరానికి ఒక్కో ప్రాముఖ్యత ఉండటం సహజం. కానీ అనేక అనుకూలతలు ఒకే నగరానికి ఉండటమనేది అరుదు. అలాంటి అనేక అనుకూలతలే హైదరాబాద్‌ను విశ్వ నగరంగా నిలిపాయి. అందుకే రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఈ మహా నగరం స్వర్గధామంగా మారింది. అత్యంత అనుకూలమైన, నివాసయోగ్య మెట్రో నగరాల జాబితాలో హైదరాబాద్‌ నిలిచింది. ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు సాధించి ఇతర మెట్రో నగరాలకు భిన్నంగా నివాస గృహాల ధరల్లో పెరుగుదలను నమోదు చేసుకొని దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉన్నదని ప్రాపర్టీ దిగ్గజ సంస్థ నైట్‌ఫ్రాంక్‌ సర్వేలో వెల్లడైన విషయం తెలిసిందే.

2020 నాలుగో త్రైమాసికంలో నిర్వహించిన గ్లోబల్‌ రెసిడెన్షియల్‌ సిటీస్‌ ఇండెక్స్‌లో హైదరాబాద్‌ 122వ స్థానంలో నిలువగా.. దేశంలోని ఇతర నగరాలన్నీ ఆ తర్వాతి స్థానంలోనే ఉన్నాయి. ముఖ్యంగా కరోనా కారణంగా అన్ని రంగాలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో హైదరాబాద్‌లో రియల్‌ రంగం మాత్రం మునుపటికంటే వృద్ధి పొందుతుంది. దీన్నిబట్టి చూస్తే పెట్టుబడులు పెట్టే వారికి నగరంపై ఎంత నమ్మకం ఉందో స్పష్టమవుతున్నదని రియల్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా దేశంలోని బెంగళూరు, అహ్మదాబాద్‌, ముంబాయి, ఢిల్లీ, కోల్‌కతా, పుణె, చెన్నై వంటి మెట్రో నగరాల్లో ధరలు పడిపోగా.. కేవలం హైదరాబాద్‌లో మాత్రమే గత ఏడాది కంటే 0.2శాతం పెరుగడం విశేషం. హైదరాబాద్‌కు పలు అంశాల్లో అనుకూలతలు ఉండటంతోనే ఏయేటికాయేడు రియల్‌ వృద్ధి నమోదవుతుందని నిపుణులు చెబుతున్నారు.

అన్ని వర్గాలకు ఉపాధి

మినీ భారతంగా విరాజిల్లుతున్న హైదరాబాద్‌ మహా నగరంలో అన్నివర్గాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవైపు ఐటీ రంగంలో విస్తృత అవకాశాలు ఉండగా.. సేవా, పర్యాటక, పారిశ్రామిక రంగాల్లోనూ పుష్కలమైన అవకాశాలు దొరుకుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచే కాకుండా దేశంలోని అనేక రాష్ర్టాల నుంచి ప్రజలు నగరానికి వచ్చి ఉపాధి పొందడంతో పాటు స్థిర నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. తద్వారా రియల్‌ రంగం గణనీయంగా పురోగతిని సాధిస్తుంది.

అత్యంత అనుకూల నివాసయోగ్యం

అత్యంత అనుకూల నివాసయోగ్య నగరంగా హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. గతంలోనూ అనేక సర్వేల్లో ఇదే విషయం వెల్లడైంది. ముఖ్యంగా ఇక్కడి వాతావరణం అత్యంత అనుకూలంగా ఉండటంతో ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఇతర ప్రాంతాల వారు కూడా ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా అంతర్జాతీయ కంపెనీలు సైతం అనుకూల వాతావరణం దరిమిలా తమ ప్రధాన కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేస్తారనేది విధితమే. మరోవైపు అన్నివర్గాల ప్రజలకు ఆయా స్థాయిల్లో ధరల మేరకు గృహాలు అందుబాటులో ఉండటమనేది కూడా హైదరాబాద్‌కు ఉన్న మరో ప్రత్యేకత. ఖరీదైన ప్రాంతాలతో పాటు మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి హైదరాబాద్‌ మంచి వేదిక అని తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జీవీ రావు స్పష్టం చేశారు.

వరంలా ప్రభుత్వ విధానాలు

హైదరాబాద్‌లో అన్నిరకాల అనుకూలతలు ఉండటం ఒక ఎత్తయితే… తెలంగాణ ప్రభు త్వ విధానాలు నగరానికి ఒక వరంలా మారుతున్నాయి. టీఎస్‌-ఐపాస్‌తో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున విజయాన్ని సాధించింది. దీంతో పాటు టీఎస్‌-బీ పాస్‌ ద్వారా ధనికులు మొదలు సామాన్యుడు సైతం సులువుగా తమ సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నాడు. వీటన్నింటికీ తోడు ధరణి ద్వారా వచ్చిన విప్లవాత్మక మార్పులతో భూముల విషయంలో భద్రత (సెక్యూరిటీ) అనేది అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది. దీంతో రియల్‌ రంగంలో వ్యాపారులు మొదలు సామాన్యుడు డబ్బులను పెట్టేందుకు ఎలాంటి భయాందోళనలు లేకుండా ముందుకొస్తున్నారు.

అత్యుత్తమ మౌలిక సదుపాయాలు

అత్యుత్తమ మౌలిక సదుపాయాలు అనేవి హైదరాబాద్‌ నగరానికి ఉన్న మరో ప్రత్యేకత. నగరం నలువైపులా విస్తరిస్తుండగా.. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు రహదారులను విస్తరిస్తుండటంతో నగరం చుట్టూ రియల్‌ రంగం దినదినాభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా దేశంలోని ఇతర ఏ మెట్రో నగరాలకు లేనివిధంగా చుట్టూ 158 కిలోమీటర్ల అవుటర్‌ రింగు రోడ్డు ఉండటంతో నగరంలోని ఒక మూల నుంచి మరో మూలకు వెళ్లేందుకు పెద్దగా సమయం పట్టదు. ఇక మెట్రో రైలు ఇప్పటికే మూడు మార్గాల్లో అందుబాటులోకి రావడం.. ప్రభుత్వం రెండో దశను కూడా వేగంగా పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తుండటం రియల్‌ ఊతానికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఎంఎంటీఎస్‌ కూడా మధ్య తరగతి ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థగా సేవలు అందిస్తుంది.

హైదరాబాద్‌కు చాలా అనుకూలతలు ఉన్నాయి

ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే చాలా అంశాలు దోహదం చేస్తాయి. అలాగే హైదరాబాద్‌ నగరం జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో వృద్ధి చెందడానికి అనేక అనుకూలతలు ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు మధ్యన ఉండటం, నివాసానికి అత్యంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఎవరి స్థోమతను బట్టి వారు ఇండ్లను కొనుగోలు చేసేలా ధరలు ఉన్నాయి. దీనికి తోడు గత 5-6 ఏండ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, జరుగుతున్న అభివృద్ధి చాలా మందిని ఆకర్శిస్తున్నాయి. దీంతోనే హైదరాబాద్‌లో ఇండ్లకు డిమాండ్‌ ఉంది. ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.- జి.రాంరెడ్డి, క్రెడాయ్‌ నేషనల్‌ ఉపాధ్యక్షుడు

పెట్టుబడులకు అత్యంత కీలకంగా మారింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రభుత్వాల కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సుస్థిర పాలనను అందిస్తున్నది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానాన్ని ఎంతో పక్కాగా అమలు చేస్తున్నది. సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. టీఎస్‌-ఐపాస్‌, టీఎస్‌-బీపాస్‌ వంటి పాలసీలు అందరినీ ఆకర్శిస్తున్నాయి. దీంతోనే స్థానికులే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ స్థాయి నుంచి ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.- జీ.వీ.రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌

ఐటీ రంగం విస్తరణ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయస్థాయి పెట్టుబడులు అనేవి పెద్దగా ఉండకపోయేవి. స్థానిక పెట్టుబడులే అధికంగా ఉండేవి. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దిగ్గజ అంతర్జాతీయ కంపెనీలు ముమ్మరంగా ఇక్కడ పెట్టుబడులు పెడుతుండటంతో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి మరింత ఊపునిస్తుంది. గతంలో కేవలం సైబరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని నగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలీకృతమైంది. ఇందుకు అనుగుణంగా రియల్‌ రంగంలోనూ వృద్ధి నమోదవుతుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రియల్‌ బూమ్‌ జోర్‌దార్‌

ట్రెండింగ్‌

Advertisement