Ration | అబిడ్స్, జూన్ 11: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు నెలల రేషన్ సన్న బియ్యం పంపిణీ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని హైదరాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఏ.రమేశ్ తెలిపారు. ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఈ నెల 30వ తేదీలోపు వారి కోటా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చౌక ధరల దుకాణాలు తెరిచి ఉంటాయని చెప్పారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న రేషన్ కార్డుదారులకు దాదాపు 48% కార్డుదారులకు మూడు నెలల రేషన్ సరుకులను పంపిణీ చేసినట్లు ఏ.రమేశ్ తెలిపారు. ప్రతి కార్డుదారునికి రేషన్ సరుకులు అందేలా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని.. ఎవరు గాబరా పడాల్సిన అవసరం లేదన్నారు. రేషన్ బియ్యం సక్రమంగా జరిగేలా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని కార్డుదారులు రేషన్ బియ్యాన్ని ఎవరికైనా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బియ్యం విక్రయించిన వారు పట్టుబడితే కార్డు రద్దు చేయడంతో పాటు వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నూతన సాఫ్ట్వేర్ లో అనేక మార్పులు తీసుకురావడం వలన ప్రస్తుతం సరుకుల పంపిణీ వేగంగా జరుగుతోందని తెలిపారు.