మేడ్చల్, సెప్టెంబర్6 (నమస్తే తెలంగాణ): రేషన్ కార్డుల జారీలో సర్కార్ తీవ్ర జాప్యం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు నెలల క్రితం (జనవరి 15న) రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నూతన కార్డుల కోసం లక్ష 22 వేల దరఖాస్తులు రాగా.. ఇప్పటివరకు ఇచ్చింది కేవలం 35,172 రేషన్ కార్డులు మాత్రమే.
మిగతా దరఖాస్తుదారులకు రేషన్ కార్డులు ఇస్తారా? ఇవ్వరా? అనే విషయమై ఎలాంటి క్లారిటీ లేదు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాలకు చెందిన రేషన్ కార్డులు అందని దరఖాస్తుదారులు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయాలు చుట్టూ తిరిగి అధికారులను రేషన్ కార్డుల గురించి అడిగితే విచారణ చేస్తున్నామని చెప్పి తప్పించుకుంటున్నారని దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు.
సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులే ప్రమాణికం..
నిరుపేదలకు ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులే ప్రమాణికంగా ఉండటంతో నిరుపేదలు రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. ఆర్యోగ్ర శ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్, ప్రభుత్వ పథకాలు పొందాలంటే తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు ఉండాల్సిందే. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డులు అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యహరిస్తుందన్న ఆరోపణలు ప్రజలు నుంచి వస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో నూతన కార్డుల కోసం లక్షా 22 వేలు మంది దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు కేవలం 35,172 మందికి మాత్రమే రేషన్ కార్డులు జారీ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
కార్డుల జారీలో అధికారుల చేతివాటం
రేషన్ కార్డుల జారీలో విచారణ చేస్తున్న అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి. ఎలాంటి అర్హత లేకున్నా రేషన్ కార్డు పొందాలంటే రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు విచారణ చేసే అధికారులు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అనేక మంది అర్హత లేని వారు రేషన్ కార్డులు పొందారని, అసలైన అర్హుకు మాత్రం రేషన్ కార్డులు అందలేదని అనేకమంది దరఖాస్తుదారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అర్హత లేకున్నా రేషన్ కార్డులు పొందిన వారిని గుర్తించి వారి రేషన్ కార్డులు రద్దు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రూ.2 లక్షలకు మించి ఆదాయం ఉండటంతో పాటు సొంత వాహనాలు ఉన్న వారందరికీ డబ్బులు తీసుకొని అధికారులు రేషన్ కార్డులను అందించారని ప్రజలు ఆరోపిస్తున్నారు.