Ponnam Prabhakar | సిటీబ్యూరో: అర్హులందరికీ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేస్తామని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ఆదివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం జరిగింది. అర్హులందరికీ రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొన్నం చెప్పారు. ఈ నెల 16-20వ తేదీ మధ్య ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుందని, ఈ నెల 20-24వ తేదీ మధ్య వార్డుల వారీగా గ్రామ సభలు ఏర్పాటు చేసి.. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేస్తారన్నారు.
ఈ నెల 21-25 మధ్య డేటా ఎంట్రీ పూర్తవుతుందన్నారు. సర్కారు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను కేటాయించినట్లు చెప్పారు.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ప్రకటన ఉంటుందని, హైదరాబాద్‌లో సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి సంబంధించి 50 శాతం అప్లికేషన్లు వచ్చాయన్నారు. గ్రేటర్ హైదరాబాద్ 10 లక్షల 70వేల 463 దరఖాస్తులు ప్రజాపాలనలో రాగా, అందులో 50 శాతం సర్వే చేయగా అందులో ఇంటి స్థలం ఉన్న వారు 9,913 మంది ఉన్నారన్నారు.