మాదాపూర్, ఏప్రిల్ 21: ఛత్తీస్గడ్ రాష్ట్రం రాయపూర్‌కు చెందిన 9 నెలల శిశువుకు కొండాపూర్‌లోని కిమ్స్ కడల్స్ వైద్యులు చికిత్స చేసి ప్రాణం పోశారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో మృత్యువుతో పోరాడుతున్న చిన్నారిని ఎయిర్ లిఫ్ట్ ద్వారా కొండాపూర్‌కు తరలించి 45 రోజుల సుధీర్ఘ పోరాటం తరువాత చికిత్సచేసి పూర్తిగా కోలుకునేలా చేశారు. దీనికి సంబంధించిన వివరాలను కొండాపూర్ కిమ్స్ కడల్స్, పీడియాట్రిక్ సియూ హెడ్, డాక్టర్ సరాగ్ డెకాటె వెల్లడించారు.
రాయపూర్‌కు చెందిన చిన్నారి మొదట జలుబు, దగ్గుతో స్థానిక దవాఖానాలో చేరడం జరిగింది. వారం రోజుల్లోనే ఆరోగ్యం క్షీణించి అడెనో వైరస్ వల్ల వచ్చే తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ (అడెనో వైరల్ నియోనియా) భారీన పడటంతో వైద్యులు వెంటలేటర్‌పై ఉంచినప్పటికీ ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో పరిస్థితి విషమించింది. దీంతో పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కిమ్స్ కడల్స్ నియోనేటల్, పీడియాట్రిక్ ట్రాన్స్పోర్ట్ బృందం వెంటనే రాయపూర్‌కు చేరుకొని వెంటిలేటర్‌పై ఉన్న శిశువును విమాన మార్గంలో(ఎయిర్ లిఫ్ట్) కొండాపూర్ కిమ్స్‌కు తరలించారు. అనంతరం వైద్య బృందం శిశువును పరీక్షించగా ఊపిరితిత్తుల చుట్టు గాలి చేరడం (న్యూమోథోరాక్స్) గమనించారు. సాధారణ వెంటిలేషన్ పనిచేయకపోవడంతో వైద్యులు వీఏ ఎక్మో చికిత్సను ప్రారంభించారు.
దాదాపు 25 రోజుల పాటు ఈ యంత్రం సహయంతోనే శిశువుకు కృత్రిమంగా ఆక్సిజన్‌ను అందిస్తూ గుండె, ఊపిరితిత్తులకు విశ్రాంతిని ఇచ్చారు. చికిత్స సమయంలో ఎదురైన అధిక వైరల్ లోడ్ అంతర్గత రక్తస్రావం వంటి సవాళ్లను అధిగమిస్తూ వైద్య బృందం నిరంతరం పర్యవేక్షించడం జరిగింది. ఆరోగ్యం మెరుగుపడటంతో చిన్నారిని ఎక్మో, వెంటిలేటర్ నుంచి తొలగించారు. మొత్తం 45 రోజుల చికిత్స అనంతరం శిశువు పూర్తిస్థాయిలో కోలుకోవడంతో మంగళవారం డిశ్చార్జి చేశారు. సమయానికి ఎక్మో వంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉండటం వల్లే చిన్నారిని కాపాడగలిగినట్లు వైద్య బృందం తెలిపారు. ఈ చికిత్సలో డాక్టర్ పరాగ్ డెకాటెతో పాటు, డాక్టర్ కల్యాణ్, అవినాష్ రెడ్డి, వినోద్ కుమార్, మాధురి, కార్డియో థోరాసిక్ సర్జన్, డాక్టర్ సందీప్, ఇన్ఫెక్షియస్ డిసీజ్ నిపుణుడు, డాక్టర్ రవితేజలు ఈ చికిత్సలో భాగమయ్యారు.