కొండాపూర్ : అత్యంత క్లిష్టమైన, అరుదైన శస్త్రచికిత్సను హైటెక్ సిటీలోని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా పూర్తిచేశారు. బంగ్లాదేశ్‌కు చెందని మహిళ ప్రాణాలు కాపాడారు. మంగళవారం దవాఖానలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శస్త్ర చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలను డాక్టర్ ప్రమోద్ రెడ్డి వెల్లడించారు.
బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ (65) కడుపులో 10.5 సెంటీ మీటర్ల వ్యాసం, 9 సెంటీ మీటర్ల పొడవుతో జాయింట్ అబ్డమినల్ ఏయోరిక్ట్ ఎన్యూరిజం (AAA) ఏర్పడింది. దీన్ని వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఈ ఎన్యూరిజం మూత్రపిండాల ధమనుల నుంచి ఏయోరిక్ట్ బైఫెర్కేషన్ వరకు విస్తరించి ఉండటంవల్ల అత్యంత క్లిష్టమైంది. చికిత్స సమయంలో మూత్రపిండాలు, ప్రేగులు, కాళ్ళకు రక్త ప్రసరణ ఆగిపోకుండా కాపాడటం సవాలుగా మారింది.
నిపుణులైన వైద్య బృందం కలిసికట్టుగా శ్రమించి భారీ ఎన్యూరిజంను విజయవంతంగా తొలగించి ఆ భాగాన్ని కృత్రిమ గ్రాఫ్ట్‌తో అమర్చినట్లు డాక్టర్ ప్రమోద్ రెడ్డి తెలిపారు. చికిత్స అనంతరం రోగి 5 రోజుల్లో పూర్తిగా కోలుకావడంతో డిశ్చార్జ్ అయి వెళ్లిందని చెప్పారు. సైలెంట్ కిల్లర్‌గా పిలవబడే ఏఏఏ, ఎలాంటి లక్షణాలు తెలియకుండానే ప్రమాదకరంగా మారుతుందని, 60 ఏండ్ల పైబడిన పురుషులు, మహిళల్లో సమస్య అధికంగా ఉంటుందని అన్నారు.
సరైన జాగ్రత్తలు, వైద్య పరీక్షలతో ఇబ్బందులు కలుగకుండా చూసుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో శస్త్రచికిత్సలో పాల్గొన్న వైద్యులు అందరూ పాల్గొన్నారు.