సిటీబ్యూరో/మాదాపూర్, జూలై 15(నమస్తే తెలంగాణ):సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లా సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ అధికారులు సర్వే నిర్వహించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. హైడ్రా చెప్పినట్లుగా అల్లాపూర్లోని సర్వే నెంబర్ 31, గుట్టలబేగంపేటలోని సర్వేనెంబర్లు 12,13లలో ప్రభుత్వ భూమి ఉన్నదనే విషయంపై కోర్టు ఆదేశాల మేరకు గుట్టలబేగంపేటలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వే చేశారు.
మాదాపూర్లోని సియేట్ మారుతి హిల్స్ కాలనీలోని సున్నం చెరువులో నివాసాలు ఏర్పర్చుకున్న పేదలు, మధ్యతరగతి ఇళ్లను హైడ్రా కూల్చేయడంతో పాటు అక్కడి స్థలాలు చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోకి వస్తాయంటూ ఎలాంటి సర్వే చేయకుండా చెప్పడంపై స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు సర్వే నివేదిక వచ్చే వరకు హైడ్రా ఎలాంటి చర్యలకు పాల్పడవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సర్వే అధికారులు జగదీశ్వర్, శ్రీనివాసచారి ఇతర విభాగాల అధికారులతో సున్నంచెరువు పరిసరప్రాంతాలకు వచ్చి సర్వే నిర్వహించారు.
ఇరిగేషన్, రెవెన్యూ, హెచ్ఎండీఏ లెక్కల ప్రకారం చూపుతున్న సర్వేనెంబర్లు, విస్తీర్ణాలు ఒకదానికొకటి పొంతన లేకపోవడంతో అధికారులు సందిగ్దంలో పడ్డారు. చివరకు కొన్ని పాయింట్స్ తీసుకుని వాటి ద్వారా సర్వే చేస్తూ అసలు చెరువు ఉన్న సర్వే నెంబర్ 30ను వదిలేయడంతో స్థానికులు సర్వే అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎఫ్టీఎల్ విషయంలో వస్తున్న సమస్యను పరిష్కరించడానికే సర్వే పెట్టమని కోరామని, అసలు చెరువు ఉన్న ప్రాంతాన్ని వదిలేసి సంబంధంలేని చోట సర్వేలు చేస్తున్నారని, చెరువుతో పాటు తమ ప్రాంతాలను కూడా సర్వే చేయాలంటూ డిమాండ్ చేశారు.
దీంతో అధికారులు అల్లాపూర్, గుట్టలబేగంపేటల్లో సర్వే చేశారు. అయితే సర్వే జరిగిన తీరు సరిగా లేదని, ఏదో నామమాత్రంగా సర్వే చేశారని సియేట్ కాలనీ ప్రతినిధులు ఆరోపించారు. అంతేకాకుండా డాక్యుమెంట్లను పరిశీలించకుండా సర్వే చేయాల్సిన అసలు ప్రాంతాన్ని వదిలేసి, నీటిపారకం ఎక్కడెక్కడ ఉందో చూడకుండా కేవలం సర్వే సిబ్బందికి అప్పగించి అధికారులంతా అక్కడినుంచి వెళ్లిపోవడంతో వారు తమకు తోచినట్లుగా సర్వే చేశారని కాలనీవాసులు అంటున్నారు. సర్వే జరుగుతున్న సమయంలో అదే ప్రాంతంలో ఉన్న విల్లాస్ వద్దకు వెళ్లిన సర్వే బృందాన్ని గేట్ వద్దే విల్లాలోకి రాకుండా సెక్యూరిటీ వాళ్లు అడ్డుకున్నారు. చివరకు సర్వే సిబ్బంది వెనకకు మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్వే సిబ్బంది వెంట చివర వరకు ఇతర శాఖలకు సంబంధించిన సిబ్బంది ఎవరూ లేకపోవడం గమనార్హం.