సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై మరింత నిఘా పెంచి, మత్తు పదార్థాలను పూర్తిగా అరికట్టేందుకు అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి. దశరథ్ అధికారులను ఆదేశించారు.
బుధవారం నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో ఎక్సైజ్ నేరాలపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో డీసీ దశరథ్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ కూడా నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ కనిపించినా అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రధానంగా రంగారెడ్డి డివిజన్లో డ్రగ్స్, గంజాయి అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు.
వీటికి తోడు ఎప్పటికప్పుడు నాన్ డ్యూటీ పైడ్ లిక్కర్ వినియోగం జరిగే ఫామ్ హౌస్, రిసార్టులు, క్లబ్బుల తదితర వాటిపై ప్రత్యేక నిఘా పెట్టి, దాడులు జరుపుతూ అక్రమ మద్యాన్ని అరికట్టాలని ఆయన అధికారులకు సూచించారు. నమోదు చేసినటువంటి కేసుల్లో వెంటనే చార్జీషీట్లు వేసి, నిందితులకు కఠిన శిక్ష పడేలా దర్యాప్తు జరపాలని, ఆబ్కారీ నేరాల్లో పట్టుబడిన వాహనాలను వెంటవెంటనే వేలం వేయడంతో పాటు నిందితుల వద్ద నుంచి పట్టుకున్న మత్తు పదార్థాలను సైతం సంబంధిత అధికారుల ఆదేశాలతో వెంటనే దహనం చేయాలని డీసీ దశరథ్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్, శంషాబాద్, సరూర్‌నగర్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు కృష్ణప్రియ, ఉజ్వలారెడ్డి, కే నవీన్, ఫయాజుద్దీన్, విజయ్ భాస్కర్ గౌడ్ లతో పాటు ఎస్టీఎఫ్ బృందాలు, ఎస్హెచ్ఓలు తదితరులు పాల్గొన్నారు.