వేసవి కాలం ముగింపు దశకు చేరింది. డిమాండ్ పీక్ స్టేజ్‌కు చేరి మళ్లీ క్రమంగా తగ్గుతోంది. విద్యుత్ వినియోగదారులు తమ ప్రాంతాల్లో ఉన్న సమస్యల పరిష్కారించాలంటూ ఇస్తున్న దరఖాస్తులు కూడా పెరుగుతున్నాయని టీజీఎస్పీడీసీఎల్ సిబ్బంది చెప్పారు. అయితే ఈ పనులు చేపట్టాలంటే ఖర్చు పరిమితికి మించి ఉంటే ఆ దరఖాస్తులు కార్పొరేట్ ఆఫీసుకు చేరాలి. తాజాగా సీఎండీ జితేశ్ వీ పాటిల్ ఇచ్చిన ఉత్తర్వులతో క్షేత్రస్తాయిలో ఇంజనీర్లకు పనులకు సంబంధించిన నిధుల పరిమితిని పెంచడంతో వారి స్థాయిలోనే చాలా పనులు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.
– సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ)
ఇదే అదనుగా కొందరు అధికారులు తమ పరిధిలోని పనులు చేయడానికి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. మేడ్చల్, రంగారెడ్డి, మెట్రో జోన్ల పరిధిలోని 10 సర్కిళ్లల్లో చేపడుతున్న పనుల్లో చాలావరకు లోపభూయిష్టంగా ఉంటున్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం వర్షాకాలం కారణంగా ప్రకృతి వైపరీత్యాలు కూడా కొందరు సిబ్బందికి కాసులు కురిపించనున్నట్లు చర్చ జరుగుతోంది. జీవనశైలిలో వచ్చిన మార్పులతో ఇళ్లల్లో కరెంట్ వినియోగం గణనీయంగా పెరిగింది. నగరంలో చాలాచోట్ల నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలలో విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు వారి ప్రాంగణాల్లోనే సబ్స్టేషన్లు ఏర్పాటు చేసుకోవలసిన అవసరం వస్తోంది. సాధారణంగా ఏర్పాటు చేసే 33/11కేవీ ఫీడర్లను దాటి 132/33కేవీ కనెక్షన్లు ఇవ్వాల్సిన అవసరం వస్తోంది. గతంలో కమర్షియల్ కాంప్లెక్స్‌లకు, అపార్ట్మెంట్లకు ప్రత్యేకంగా డీటీఆర్లు అవసరం పడేది కాగా ప్రస్తుతం వ్యక్తిగత ఇళ్లకు సైతం 25 కేవీఏ నుంచి 60 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ అవసరమవుతోంది. మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్ల పరిధిలోని సర్కిళ్లన్నింటిలో సైబర్సిటీలో అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉంది. ఇక్కడ ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండటం, కొత్తగా జీసీసీలు వస్తుండటంతో విద్యుత్ వాడకం అధికంగా ఉంటున్నది. మరోవైపు నగరంలో కొత్త కొత్త వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. సాధారణంగా మేడ్చల్ జోన్ పరిధిలో నగర శివారు ప్రాంతాలు అధికంగా ఉండడం.. ఇక్కడ కూడా కొత్త కనెక్షన్లకోసం వినియోగదారులు ఎక్కువగా దరఖాస్తు చేసుకుంటున్నారు. విద్యుత్ కొత్త కనెక్షన్, ఆ శాఖలో ఇతర పనులు కావాలంటే ముందు గా దరఖాస్తు చేసుకోవాలి. ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పరిశీలించి ఎంత వ్యయం అవుతుందో ఎస్టిమేషన్ వేయాలి. ఆ మేరకు వినియోగదారుడు డబ్బులు చెల్లిస్తే పనులు చేపడతారు.
మేడ్చల్ జోన్‌లోని శివారు ప్రాంతాలు విద్యుత్ ఇంజినీర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇటీవల కీసర సెక్షన్ పరిధిలోని అక్రమ వెంచర్లలో నిబంధనలకు విరుద్ధంగా ఒక లే అవుట్‌కు ట్రాన్స్ఫార్మర్ లేకుండానే 7 స్తంభాలకు అంచనాలు రూపొందించి 9 స్తంభాలు వేసి లైన్లు లాగారు. ఈ వ్యవహారంపై ఏఈ, ఏడీఈపై విజిలెన్స్‌కు ఫిర్యాదు రావడంతో రాత్రికిరాత్రే తీగలను తొలగించారు. రాంపల్లిలో ఒక వెంచర్‌కు 13 స్తంభా లు, ఒక ట్రాన్స్ఫార్మర్కు ఎస్టిమేషన్ వేసి ఇచ్చి, 52 స్తంభాలతో కనెక్షన్ ఇచ్చారు. బినామీ కాంట్రాక్టర్ల పేరు తో కొందరు ఇంజనీర్లే పనులు దక్కించుకుంటున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. మేడ్చల్ సర్కిల్ డీపీపల్లి సెక్షన్‌లోని దొమ్మర పోచంపల్లిలో ఒక ఫామ్‌హౌస్ కోసం ఎస్టిమేషన్ లేకుండానే 6 స్తంభాలు వేసి తీగలు లాగారు. రాజరాజేశ్వరీనగర్‌లో ఎస్టిమేషన్ లేకుండా 3 స్తంభాలు వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్టిజన్లు, క్షేత్రస్థాయిలో కొందరు ఇంజినీర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా విజిలెన్స్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
రంగారెడ్డి జోన్ పరిధిలోని కొన్ని కీలక సర్కిళ్లలో నూతన విద్యుత్ కనెక్షన్లతో పాటు ఏ పనికి సంబంధించిన ఫైల్ అయినా కార్పొరేట్ ఆఫీసుకు వెళ్లాలంటే ఫైల్‌ను బట్టి రేటు నిర్ణియస్తున్నారనే విమర్శలున్నాయి. జోన్ పరిధిలో జరిగే పనులకు ఒక రేటు, కార్పొరేట్ ఆఫీసుకు వెళ్లే ఫైల్ అయితే మరో రేటుగా ఫిక్స్ చేశారు. దీంతో పని విలువ పెరుగుతుంటే ఫైల్‌కు ఇవ్వాల్సిన డబ్బులుకూడా పెరుగుతాయని, చిన్న పనులైతే రూ.30 వేల నుంచి రూ.40వేలు తీసుకుంటున్నట్లుగా విమర్శలున్నాయి. డీటీఆర్లు, లైన్ల మార్పిడికి సంబంధించి సెక్షన్ కాంట్రాక్టర్లతో రెగ్యులర్‌గా ఒప్పందాలు ఉండటంతో నెలవారీ మామూళ్ల సంగతి మింట్‌కాంపౌండ్‌లోని ఉన్నతాధికారుల వరకు తెలుసంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు కార్పొరేట్ కార్యాలయం వరకు వెళ్లే ప్రతీ పనికి తప్పనిసరిగా డబ్బులు ముట్టజెప్పనిదే ఫైల్ కదిలే పరిస్థితే లేదంటూ టాక్.
మెట్రోజోన్లోనూ దాదాపు అదే పరిస్థితి కొనసాగుతోంది. ఇందులోని కొన్ని ముఖ్యమైన సర్కిళ్లలో వచ్చే పనులు, డీటీఆర్‌ల మార్పిడి, లైన్లు వేయడం వంటి వాటినుంచి మొదలుకొని అదనపు లోడ్కోసం వినియోగదారుల దరఖాస్తుల వరకు ప్రతీ పనిలోనూ ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందేనంటూ కొందరు కాంట్రాక్టర్లు, ఉద్యోగులు బాహాటంగా చెప్పుకుంటున్నారు. తాజాగా సీఎండీ జితేశ్ వీ పాటిల్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం నిధుల మంజూరీ పరిమితి పెంపు కొందరు ఇంజినీర్ల పాలిట కల్పవృక్షంలా మారింది. తమ పరిధిలో లేని పను లు కూడా ఇప్పుడు ఇచ్చిన జీవోతో తమ పరిధిలో కే రావడంతో పెద్ద స్థాయి ఉద్యోగులు సైతం ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
సీఎండీ జితేశ్ పాటిల్ స్వయంగా ఉత్తర్వులు ఇచ్చినా వాటిని అమలు పరచడంలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. ఎస్టిమేషన్లు వేయడం మొదలుకొని చిన్నచిన్న పనుల వరకు కూడా ఎక్కడా సీఎండీ నిర్ణయాలు అమలు కావడం లేదు. కేవలం ఏదైనా పైరవీతో వస్తే తప్ప పనులు చేసేది లేదని, తమకు ఎలాంటి ఉత్తర్వులు చేతికి అందకుండా తాము ఏ పని చేయలేమని స్థానిక ఇంజినీర్లు చెబుతున్నారు. అయితే వినియోగదారులు ఉత్తర్వులు చూపించినప్పటికీ.. తమకు లేనిపోని తలనొప్పి తేవద్దని, తమ చేతికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందితే తప్ప నోటరీల విషయంలో కానీ, ఓసీల అంశంలో కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేమంటూ తెగేసి చెప్తున్నారు. దీంతో వినియోగదారులు కార్పొరేట్ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడకు వెళ్తే తాము ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు వస్తున్నారంటూ ఉన్నతాధికారులు చెబుతున్నారని, క్షేత్రస్థాయి అధికారుల తీరుతో తమకు చాలా ఇబ్బందులు ఉన్నాయంటూ కొందరు నగరవాసులు విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఇదిలాఉంటే అక్రమ లేఅవుట్లకు విద్యుత్ లైన్లు వేయడం, ఎస్టిమేషన్ లేకుండానే పనులు చేయడం, అనుమతి లేకుండా స్తంభాలను మార్చడం వంటి అక్రమాలకు శివారు ప్రాంతాలు అడ్డాగా మారుతున్నాయి. ఆపనులను కొందరు ఆర్టిజన్లు, ఇంజనీర్లు వేరే మార్గంలో చేసి జేబులు నింపుకుంటున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సిబ్బంది, ఇంజినీర్లు కొందరు గుట్టుగా వ్యవహారాలు నడుపుతున్నారు. వీటన్నిటినీ ఎప్పటికప్పుడు చూడాలంటూ ప్రతీరోజూ సీఎండీ తమ అంతర్గత సమావేశాల్లో చెప్పినప్పటికీ ఉన్నతాధికారులు మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి.
దక్షిణ డిస్కం క్షేత్రస్థాయిలో చేపట్టే అభివృద్ధి పనులు వేగంగా పూర్తి కావడానికి నిధుల కోసం కార్పొరేట్ ఆఫీసు చుట్టూ తిరగకుండా చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లకు పూర్తిస్థాయిలో అధికారాలు కల్పిస్తూ సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు 33కేవీ హశ్రీచ్టీ సర్వీస్ ఆటో ఎస్టిమేషన్, అగ్రిమెంట్, రిలీజ్ పనులన్నీ జోన్ స్థాయిలో చీఫ్ ఇంజనీర్ పూర్తి చేసేందుకు అవకాశం కల్పించారు. ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు చేయాల్సిన పనులకు కూడా పరిమితి పెంచడంతో అధికారుల్లో ఆనందం కనిపిస్తోంది. ముఖ్యంగా గతంలో డీఈకి రూ.లక్ష పరిమితి ఉండగా దానిని రూ.2లక్షలకు, ఎస్ఈకి రూ.5లక్షల నుంచి రూ.25లక్షలకు, సీఈకి రూ.10లక్షల నుంచి రూ.50లక్షలకు పెంచారు. సివిల్ పనులకు ఎస్ఈ పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు, సీఈ స్థాయిలో పనులకు రూ.7లక్షల నుంచి రూ.30లక్షలకు పెంచారు. ఇంతకుముందు క్షేత్రస్థాయిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్నా వాటికి నిధులు కేటాయించాలన్నా కార్పొరేట్ కార్యాలయానికి సంబంధిత ఫైల్ రావలసిన పరిస్థితి ఉండేది. ఫైళ్ల క్లియరెన్స్‌కు మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టేది.