ఖైరతాబాద్, జూన్ 16: తెలుగు జర్నలిజానికి ఓ ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చిన ‘ఈనాడు’ సంస్థల అధినేత దివంగత రామోజీరావు ఈ వృత్తిలో కొనసాగుతున్న వారికి మార్గదర్శకులుగా నిలుస్తారని పలువురు వక్తలు అన్నారు. రామోజీరావు సంతాప సభ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగింది. ఈనాడు పత్రికలో తమ ప్రస్థానం ప్రారంభించి వివిధ పత్రికల్లో ఉన్నత స్థాయిలో ఉన్న సంపాదకులు, జర్నలిస్టులు రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. అంతకు ముందు రామోజీరావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ.. రామోజీ రావుతో తన అనుబంధాన్ని సభికులతో పంచుకున్నారు. 1994లో ఈనాడులో చేరినప్పుడు చైర్మన్‌గా ఉన్న రామోజీరావు తనను స్వయంగా ఇంటర్వ్యూ చేశారని గుర్తు చేసుకున్నారు. ఒక మనిషి తనను తాను మార్చుకోగలడని, అలాంటి శక్తి రామోజీరావులో చూశానని, ఇది తనకు ఎదురైన అనుభవంగా గుర్తు చేసుకున్నారు. తాను సెంట్రల్ డెస్క్‌లో పనిచేసే తరుణంలో కంప్యూటర్లు కావాలని అడిగితే వెంటనే సమకూర్చారని, కొత్త సాంకేతికతను ఆపాదించడంలో ఆయన ముందున్నారని అన్నారు.
అవతలి వారు చేసే కృషిని, వారి కష్టాన్ని ప్రజెంట్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఏనాడు వెనుకాడేవారు కాదని, తాను సూచించిన గ్రహం అనుగ్రహం అలానే వచ్చిందన్నారు. నిర్ణయాలు తీసుకోవడంలోనూ తన నిర్ణయం తప్పని తెలిసినప్పుడు దానిని ఉపసంహరించుకోవడంలోనూ ఆయన అంతే సాహసం చూపించారన్నారు. గొంతులో ప్రాణం ఉండగా, చేయాల్సిన పనిచేయాలి, చేయకూడని పని చేయొద్దు, ఈ రెండింటికి రామోజీరావు ఉదాహరణ అని అన్నారు. రాయిని రత్నంగా సానబెట్టగలిగిన శక్తి రామోజీరావు సొంతమని, అలాంటి సానబట్టబడిన వ్యక్తిలో తానొకరినని, తాను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణమన్నారు. రామోజీరావు తనకు జీవితకాలపు మార్గదర్శి అని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, ఈనాడు ఏపీ ఎడిటర్ ఎం.నాగేశ్వర్ రావు, తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్, తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, సీనియర్ జర్నలిస్టులు రామచంద్రమూర్తి, వల్లీశ్వర్, పీఎస్‌ఆర్‌సీ మూర్తి, కందుల రమేశ్, టీయూడబ్యుజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఎల్. వేణుగోపాల నాయుడు పాల్గొన్నారు.