రామంతాపూర్, జూన్ 7 : రామంతాపూర్ హోమియోపతి ప్రభుత్వ దవాఖానలో కొందరు అధికారుల నిర్లక్ష్యం రోగులు, వైద్య సిబ్బంది పాలిట శాపంగా మారుతున్నది. శుక్రవారం దవాఖానలో భవనం పైకప్పు పెచ్చులూడి రోగులకు చికిత్స చేస్తున్న ఓ వైద్య విద్యార్థి, నర్సింగ్ సిబ్బందిపై పడడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి దవాఖాన ఆవరణలో ఉన్న ఇన్ పేషంట్ మేల్ వార్డులో స్లాబ్ పెచ్చులూడి అక్కడ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య విద్యార్థిని స్నేహిత, హెడ్ నర్సు సునీతపై పడ్డాయి. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. తృటిలో ప్రాణపాయం తప్పిందని అక్కడి సిబ్బంది తెలిపారు. ఇన్‌పేషెంట్ వార్డు ఉన్న భవనం పురాతనమైనది కావడంతో పాటు దాని పర్యవేక్షణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు.
విషయం తెలుసుకున్న రాష్ట్ర ఆయుష్ కమిషనర్ ప్రశాంతి పెచ్చులూడిన భవనాన్ని సందర్శించారు. మరమ్మతుల కోసం ఇప్పటికే రూ.10 లక్షలు కేటాయించినప్పటికీ ఎందుకు మరమ్మతు చేయించలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరమ్మతుల కోసం మరిన్ని నిధులు ఇస్తామని వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ఇదే సమయంలో, కమిషనర్ ముందే సూపరింటెండెంట్, ప్రిన్సిపల్ మధ్య గొడవ జరిగింది. దీంతో కమిషనర్ వారిపై అగ్రహం వ్యక్తం చేశారు. వార్డులో ఉన్న పేషంట్లను వెంటనే వేరే బ్లాక్‌లోకి షిఫ్టు చేయాలని ఆదేశించారు. గాయపడిన వైద్య విద్యార్థి స్నేహిత మంచి వైద్యం అందించాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పలువురు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.
చికిత్స కోసం రామంతాపూర్ హోమియో దవాఖానకు వస్తే ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొందని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా శిథిలావస్థలో ఉన్న ఈ భవనంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోగులకు చికిత్స అందిస్తున్నామని జూనియర్ డాక్టర్లు వాపోతున్నారు. హోమియో దవాఖాన, కళాశాల అధికారుల మధ్య ఉన్న ఆదిపత్య పోరుతో దవాఖానకు సంబంధించిన సమస్యల పరిష్కారం, మౌలిక వసతులు ప్రశ్నార్ధకంగా మారుతున్నట్లు వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఆయుష్ అధికారులు స్పందించి నిత్యం వందల సంఖ్యలో వచ్చే రామంతాపూర్ హోమియో దవాఖాన సమస్యలపై దృష్టి పెట్టి, శిథిలావస్థలో ఉన్న ఇన్‌పేషెంట్ వార్డు ఉన్న భవనానికి మరమ్మతులు చేయించాలని వైద్య సిబ్బంది, రోగులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా పెచ్చులూడిన ఘటనతో అక్కడ చికిత్స పొందుతున్న 12మంది రోగులను మరో వార్డుకు తరలించినట్లు దవాఖాన సూపరింటెండెంట్ డా.లక్ష్మీదేవి తెలిపారు.