సిటీ బ్యూరో: ఎన్నికల ఏర్పాట్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని పనులను నిలిపేస్తామని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికలు జరిగి 14 నెలలు దాటుతున్నా.. ఏర్పాట్ల కోసం వెచ్చించిన బిల్లులను విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… 2023 నవంబర్లో నిర్వహించిన శాసనసభ ఎన్నికలు, 2024 ఏప్రిల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల బిల్లులను విడుదల చేయకుండా కాంట్రాక్టర్లను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల నిర్వహణకు టెండర్లు పిలిచి, అడ్వాన్స్ ఇవ్వకున్నా పనులు చేశామని వాపోయారు. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు దాటుతున్నా బిల్లులు విడుదల చేయకుండా కాంట్రాక్టర్లను ఆర్థికంగా కుంగదీస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి అవాంతరాలు రాకుండా ఎన్నికల నిర్వహణను విజయవంతంగా పూర్తి చేసి, ప్రభుత్వానికి దన్నుగా నిలిచామని గుర్తు చేశారు. ఇప్పటికైనా తమకు రావాల్సిన బిల్లులను విడుదల చేయకుంటే నిరసనలు చేపట్టి, ప్రభుత్వంలో చలనం వచ్చేలా కార్యచరణ రూపొందిస్తామని వెల్లడించారు.
ఎన్నికల నిర్వహణకు కొన్ని చోట్ల రిటర్నింగ్ ఆఫీసర్లు తమ బినామీలకే కాంట్రాక్టులిచ్చారని వారు ఆరోపించారు. అలాంటి వారికి మాత్రం బిల్లులు చెల్లించుకున్నారని, నిజాయతీగా టెండర్లో పాల్గొని ఎన్నికల నిర్వహణ విజయవంతమవ్వడానికి కారణమైన మిగతా కాంట్రాక్టర్లకు మొండి చేయి చూపుతున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్ల పేరిట వచ్చిన డబ్బును పీఓ, ఈపీఓ, ఇతర ఎన్నికల సిబ్బందికి టీఏ, డీఏల రూపంలో ఇచ్చారన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో టెండర్లు పిలిచి ఎన్నికల నిర్వహణ చేపట్టారని.. బిల్లులు మాత్రం ఒక మలక్ పేట నియోజకవర్గ పరిధిలోని కాంట్రాక్టర్లకు మాత్రమే చెల్లించారని ఆరోపించారు. పెండింగ్ బిల్లులు చెల్లించేలా చూడాలంటూ రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇచ్చామని గుర్తు చేశారు. ఆమె ఆదేశాలతో గత డిసెంబర్లోనే రూ.27.5 కోట్లకు ప్రభుత్వం మేమెంట్ ఆర్డర్ ఇచ్చిందన్నారు. 15 నియోజకవర్గ పరిధిలోని కాంట్రాక్టర్లందరికీ చెక్కులు మంజూరు చేస్తే.. ఆర్థిక శాఖ నుంచి మాత్రం మలక్ పేటకు మాత్రమే డబ్బులు ఇచ్చారని వాపోయారు. దీనిపై ఉన్నతాధికారులను కలిస్తే స్పందన కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ సమస్యను చెప్పుకుందామని ఏడాది నుంచి సీఎం అపాయింట్మెంట్ అడుగుతున్నా పట్టించుకోవడం లేదని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కాంట్రాక్టర్లు అంటేనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దగ్గరకు రానీయడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని రిటర్నింగ్ అధికారి నుంచి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దాకా అందరినీ కలిసి వినతి పత్రాలు అందించామని తెలిపారు. ఎవరూ తమకు సరైన సమాధానం ఇవ్వడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే కేంద్రంలోనే తేల్చుకుంటామని చెప్పారు. ప్రభుత్వంలో చలనం వచ్చేలా పకడ్బందీ ప్రణాళికతో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని దాదాపు 350 మంది కాంట్రాక్టర్లను ఆర్థికంగా కుంగదీసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. ఎన్నికల బిల్లులతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన పనులకు సంబంధించిన నిధులను విడుదల చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.