ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 3: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా తక్షణమే రెండు లక్షల ఉద్యోగాల(jobs) భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో(Osmania University) ర్యాలీ నిర్వహించారు. మెయిన్ లైబ్రెరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ చేపట్టి, ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మోతీలాల్‌నాయక్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయినా ఇప్పటికీ ఇచ్చిన హామీని నిలుపుకోకపోవడంతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపాల్సిన దుస్థితి నెలకొందన్నారు.
ముందుగా వెంటనే రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వానికి వారం రోజుల గడువు ఇస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఇచ్చిన విధంగానే తెలంగాణలోనూ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని సూచించారు. వారంలోగా జాబ్ క్యాలెండర్‌తో పాటు డిగ్రీ అర్హతతో 12 వేల వీఆర్వో ఉద్యోగాలు, డిప్లొమా ఇన్ సివిల్ అర్హతతో డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, కుల సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.