ఖైరతాబాద్, ఏప్రిల్ 1 : దేశ ప్రధానిగా ఉన్నప్పుడు దివంగత ఇందిరాగాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి భూములనిస్తే..ఆ భూములను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాక్కుంటున్నాడు. ఈ భూ ఆక్రమణలపై ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. గ్రూప్ 1 పరీక్షల్లో అన్యాయానికి గురైన బాధిత అభ్యర్థులకు బాసటగా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్సీయు, గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పారని, ఆ ఉద్యోగాల మాట పక్కన పెడితే కనీసం గ్రూప్ పరీక్షలు సక్రమంగా నిర్వహించడంలో విఫలమయ్యారన్నారు. గ్రూప్ 1 లో 40 శాతం విద్యార్ధులు తెలుగు మీడియంకు సంబంధించిన వారు ఉన్నారని, కనీసం టాప్ 500లో ఒక్కడంటే ఒక్క విద్యార్థి కూడా లేకపోవడం దారుణమన్నారు. బీఆర్ఎస్ తరఫున ప్రజలకు, విద్యార్ధులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు.
ప్రభుత్వం తన తప్పులు సరిదిద్దుకొని వెంటనే గ్రూప్1లోని అన్ని పేపర్లు రివాల్యూయేషన్ చేయించాలని డిమాండ్ చేశారు. హెచ్సీయులో ప్రభుత్వం చేపట్టిన విధ్వంసంలో 700 జీవరాశులు, 200 వృక్షాలు అంతరించిపోతున్నాయని, బుల్డోజరు చక్రాల కింద జాతీయ పక్షిలు నలిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని కావాలని కలలుగంటున్న రాహుల్ గాంధీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే రేవంత్ రెడ్డిని సీఎం పదవీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ విఠల్, తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్, ఉద్యమ నేతలు జనార్ధన్, మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.