మణికొండ, జూన్ 15 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఆదివారం (5కే రన్), వన మహోత్సవ కార్యక్రమాన్ని నార్సింగి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గండిపేటలోని మెలుహ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని వారు మొక్కలు నాటి అనంతరం ఐదు కిలోమీటర్ల పరుగును జెండా ఊపి ప్రారంభించారు. మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల ప్రదర్శన స్టాల్స్‌ను సందర్శించి ప్రారంభించారు. అనంతరం 5K Run లో పాల్గొన్న ప్రతిభావంతులందరికీ సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 100 రోజుల ప్రణాళికతో ప్రజా సమస్యలను గుర్తిస్తూ ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టాలని ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి 5K రన్ తో పాటు ప్రజా అవసరాలను గుర్తించి చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులు ఎప్పటికప్పుడు చర్చించి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.