Rains | సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో రెండు రోజులుగా వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం నగరంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రాత్రి 7గంటల వరకు లంగర్‌హౌస్‌లో 3.0 సెం.మీలు, కార్వాన్లో 2.35 సెం.మీలు, ఆసిఫ్‌నగర్‌లోని అల్లబండలో 2.28 సెం.మీలు, కిషన్‌బాగ్‌లో 2.15 సెం.మీలు, పాతబస్తీ దూద్‌బౌలిలో 1.83 సెం.మీలు, జియాగూడ, షేక్‌పేట, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో 1.50 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. ఆవర్తనం, ద్రోణి ప్రభావం కొనసాగుతుండడంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 35.6, కనిష్ఠం 22.8 డిగ్రీలు, గాలిలో తేమ 43శాతంగా నమోదైనట్లు వివరించారు.