సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): నగరంలో బుధవారం రాత్రి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఉన్నట్టుండి రాత్రి పదిన్నర గంటల నుంచి వర్షం దంచికొట్టింది. బంజారాహిల్స్, హైటెక్‌సిటీ, బేగంపేట, మెహిదీపట్నం, కోఠి, సికింద్రాబాద్, దిల్‌సుక్‌నగర్ తదితర ప్రాంతాల రోడ్లన్నీ జలమయమయ్యాయి.
నాలాలు పొంగిపొర్లాయి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. నగరంలోని లోతట్టు ప్రాంతాల వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఇదిలా ఉంటే నైరుతి రుతుపవనాల ప్రభావంతో మరో రెండు రోజులు గ్రేటర్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
నగరంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28.4డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22.5డిగ్రీలు, గాలిలో తేమ 79% నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే నీటి పైప్‌లైన్ పగలగా పంజాగుట్ట ఫ్లై ఓవర్‌పై, దూల్పేట్ నుంచి మేడ్చల్‌కు వినాయకుడిని తరలిస్తుండగా ట్యాంక్‌బండ్ రోడ్డు మార్గంలో కిందపడి పోగా భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.