సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో మంగళవారం రాత్రి గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్‌పేట, మెహిదీపట్నం, అల్వాల్ తదితర ప్రాంతాల్లో చినుకులు పడ్డాయి. రాత్రి 9 గంటల వరకు టోలిచౌకిలో 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు. రాగల మరో రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 33.7డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.2డిగ్రీలు, గాలిలో తేమ 59శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.